Top10 News: అమెరికా, ఇరాన్‌ డీల్‌.. మెట్రోపై సీఎం ఆరోపణలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

Top10 News: అమెరికా, ఇరాన్‌ డీల్‌.. మెట్రోపై సీఎం ఆరోపణలు.. ఈ రోజు టాప్10 న్యూస్ |


తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అయినా ఉద్యమ అమరవీరులకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడంలో జాప్యం ఎందుకని ఢిల్లీలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వారి త్యాగాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని ఆయన అన్నారు. అమరవీరులకు నివాళులర్పించేందుకు గతంలో వెళ్లాలనుకున్నప్పుడు అనుమతి నిరాకరించారని అన్నారు. యువత బలిదానాలతో కొందరు నాయకులు అధికారంలోకి వచ్చారని విమర్శించిన పవన్ కళ్యాణ్, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం జనసేన కట్టుబడి పనిచేస్తుందని అన్నారు.

2. ఇక నుంచి ప్రభుత్వ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్‌

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తూ హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ వడ్డించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.44 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. అలాగే కొత్త విద్యా సంవత్సరం తొలి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సదుపాయాలను మరింత మెరుగుపర్చే దిశలో దీన్ని కీలక అడుగుగా భావిస్తున్నారు.

3. మెట్రో విస్తరణను కిషన్‌రెడ్డే అడ్డుకుంటున్నారు:

హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఐఆర్‌ఎఫ్‌సీ రుణం, జపాన్ నిధుల విషయంలో కేంద్రం సహకరించడం లేదనీ, రాజకీయ కారణాలతో మెట్రో ప్రాజెక్టును అడ్డుకుంటోందని విమర్శించారు. మెట్రో విస్తరణకు అవసరమైన రూ.40 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తామని, కేంద్రం కేవలం అనుమతి ఇవ్వాలని కోరినా స్పందన లేదన్నారు. అహ్మదాబాద్, విశాఖ మెట్రోలకు అనుమతులు ఇచ్చి హైదరాబాద్‌కు ఇవ్వకపోవడం వివక్షకు నిదర్శనమని అన్నారు.

4. కాక్రోచెస్‌తో కలవొద్దు..!

పవన్ కల్యాణ్ ఢిల్లీలో జరిగిన జనసేన సమావేశంలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న శక్తులను తక్కువ అంచనా వేయకూడదని, సుమతీ శతకంలోని “బలమైన సర్పము చలిచీమల చేత జిక్కి చచ్చును” అనే సూక్తిని ఉదహరించారు. దేశ సమగ్రతకు ముప్పు కలిగించే విభజన వాద శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కోట్ల మంది కలిస్తే మంచి లేదా చెడు దిశలో పెద్ద ప్రభావం చూపగలరని చెబుతూ, ఐక్యంగా ఉండి దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలని యువతకు సూచించారు.

5. మోదీ అమెరికా సేవకుడు:

ఒమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై అమెరికా క్షమాపణ చెప్పకపోవడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. అమెరికా హెచ్చరికలు జారీ చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ విధేయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా మూడు రోజులు గడిచినా నావికుల మరణాలపై ప్రధాని స్పందించలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలు, దేశ గౌరవాన్ని దెబ్బతీస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

6. సీజేపీ ఫౌండర్‌పై దాడి

జైపుర్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. నిరసన సందర్భంగా ఆయన చెంపపై కొట్టగా, వెంటనే స్పందించిన మద్దతుదారులు దాడి చేసిన వారిపై ఎదురుదాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అబిజిత్ దీప్కే స్పందిస్తూ, యువత కంట్రోల్ తప్పొద్దనీ, ఎన్ని అడ్డంకులు వచ్చినా తమ ఉద్యమం ఆగదని అన్నారు.

7. రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్

ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తమిళనాడు రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమనే సంకేతాలు ఇచ్చారు. చెన్నైలో అభిమానులతో సమావేశమైన తర్వాత రాజకీయ అరంగేట్రంపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే తన తల్లి, మద్దతుదారులతో భారీ సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు ప్రకటిస్తానన్నారు.

8. రిటైర్మెంట్‌ అనే పదమే నాకు నచ్చదు

అక్షయ్ కుమార్ రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు రిటైర్ కావాలనిపించినా, తన కోసం వందల మంది ఎదురుచూస్తున్నారని గుర్తుచేసుకుని ఆ ఆలోచనను వదిలేస్తానన్నారు. 36 ఏళ్లుగా నిరంతరం పనిచేస్తూనే ఉన్నానని తెలిపారు. రిటైర్ అయితే కూడా ఏదో ఒక పని చేస్తానని, చనిపోయే ఐదు సెకన్ల ముందు మాత్రమే రిటైర్ కావాలని తన అభిప్రాయం వెల్లడించారు. అప్పటివరకు పనిచేస్తూనే ఉండటం మంచిదని అక్షయ్ కుమార్ అన్నారు.

9. అమెరికా-ఇరాన్‌ డీల్‌ గుడ్‌

అమెరికా-ఇరాన్‌ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదరడంతో మూడు నెలలకు పైగా కొనసాగిన యుద్ధానికి ముగింపు పలికింది. ఈ వారాంతంలో ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి. భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తూ పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొనాలని ఆకాంక్షించాయి. హర్మూజ్‌ జలసంధిలో నౌకల రవాణా నిరాటంకంగా సాగుతుందని భారత్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే ఉక్రెయిన్‌-రష్యా కూడా శాంతి దిశగా అడుగులు వేయాలని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ అన్నారు.

10. లెబనాన్‌పై కొనసాగుతున్న దాడులు

ఇరాన్‌-అమెరికా శాంతి ఒప్పందం ఖరారయ్యే దశలో ఉన్నప్పటికీ, లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తూ ఇజ్రాయెల్‌ అడ్డంకిగా మారుతోంది. లెబనాన్‌లో స్వాధీనం చేసుకున్న ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గబోమని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్ స్పష్టం చేశారు. హెజ్‌బొల్లా కాల్పులకు ప్రతిగా.. లెబనాన్ రాజధాని బీరుట్‌లోని ప్రాంతాలపై దాడులకు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఆదేశాలు జారీచేశారు. లెబనాన్‌పై దాడులు నిలిపివేయాలని ఇరాన్‌ ఒప్పందంలో షరతు పెట్టగా, జూన్‌ 19న ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని కాజెమ్‌ గరీబాబడీ తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports