Last Updated:
భారతదేశంలో అత్యధిక రోజులు నిరంతరాయంగా ప్రధానిగా పనిచేసిన ప్రజాస్వామ్య నేతగా నరేంద్ర మోదీ 4,399 రోజులు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించారు. ఈ అరుదైన మైలురాయిని అందుకోవడంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఎక్స్ వేదికగా మోదీకి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.
భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులు పూర్తి చేసుకుని, దేశ చరిత్రలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రజాస్వామ్య పాలకుడిగా చారిత్రాత్మక మైలురాయిని అధిగమించారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డును దాటేసిన ఈ అరుదైన సందర్భంలో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా నిలిచిన మోదీకి అభినందనలు అంటూ ఆమె పోస్ట్ చేశారు. ఇటీవల మోదీ రోమ్ పర్యటనకు వచ్చినప్పుడు జరిగిన సమావేశాన్ని గుర్తుచేసుకుంటూ, ఇరు దేశాల ప్రజల భవిష్యత్తు కోసం ఒక ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రారంభించడం సంతోషాన్ని ఇచ్చిందని మెలోని పేర్కొన్నారు.
Congratulazioni a @narendramodi che oggi diventa il Primo Ministro eletto più longevo nella storia dell’India.
È stato un piacere ritrovarci a Roma nelle scorse settimane e lanciare assieme un Partenariato Strategico Speciale che guarda al futuro per creare nuove opportunità… pic.twitter.com/hiQICM6eKV— Giorgia Meloni (@GiorgiaMeloni) June 10, 2026
ఇటీవల ప్రధాని మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా చివరి విడతలో ఇటలీ రాజధాని రోమ్‌లో పర్యటించారు. ఆ సమయంలో మెలోనితో కలిసి ప్రధాని మోదీ కార్లలో ప్రయాణించడం, రాత్రి వేళ వెలుగులతో మెరిసిపోతున్న ప్రసిద్ధ రోమన్ యాంఫిథియేటర్ ‘కొలోసియం’ సందర్శించడం దౌత్య వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ పర్యటనలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని మెలోనికి పార్లే ‘మెలడీ’ చాక్లెట్ ప్యాకెట్‌ను బహుమతిగా ఇచ్చారు. వీరిద్దరి స్నేహాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘మెలోడి’ (Melodi) మీమ్స్‌ను మరింత సరదాగా మారుస్తూ ఈ ప్రత్యేక బహుమతిని అందించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను మెలోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ థాంక్యూ ఫర్ ది గిఫ్ట్ అని రాశారు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారి హల్చల్ సృష్టించింది.
మరోవైపు బుధవారం నాటికి ప్రధాని మోదీ 4,399 రోజుల నిరంతరాయ పరిపాలనను పూర్తి చేసుకుని అజేయమైన నాయకుడిగా నిలిచారు. మోదీ మే 26, 2014న భారీ మెజారిటీతో మొదటిసారి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2019 మే 30న మరింత పెద్ద విజయంతో రెండోసారి, జూన్ 9, 2024న వరుసగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించారు.
ఈ సుదీర్ఘ ప్రస్థానంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేలా చేయడంలో మోదీ కీలక పాత్ర పోషించారు. తీవ్రమైన రాజకీయ పోటీ, డిజిటల్ యుగంలో నిరంతర నిఘా ఉన్న ఆధునిక కాలంలో కూడా ప్రజాదరణను కాపాడుకుంటూ ఈ చారిత్రాత్మక రికార్డును అందుకోవడం మోదీ నాయకత్వ పటిమకు నిదర్శనంగా నిలుస్తుంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













