TTD Rooms Scam: నకిలీ ఆధార్‌తో టీటీడీ గదుల బుకింగ్.. భక్తుల పేరుతో లక్షల దందా.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్..! TTD Accommodation Scam. | | ACTPnews

News18


Last Updated:

తిరుమలలో నకిలీ ఆధార్‌లతో టీటీడీ వసతి గదులను బుక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితుల వద్ద 12 నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

News18
News18

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని టీటీడీ వసతి గదులపై భారీ మోసానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఆధార్ కార్డుల ఆధారంగా టీటీడీ కేటాయించే వసతి గదులను ముందుగానే బుక్ చేసుకుని, గదులు దొరక్క ఇబ్బందులు పడుతున్న భక్తులకు ఒక్కో గదిని రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్న ఈ ముఠా వ్యవహారం టీటీడీ విజిలెన్స్ సమాచారంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఆపరేషన్‌లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 12 నకిలీ ఆధార్ కార్డులు, రెండు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు, ఇతర డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 2న తిరుమల సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ (సీఆర్వో) వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను టీటీడీ సిబ్బంది గుర్తించి తిరుమల రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. విచారణలో మొబైల్ యాప్‌ల సాయంతో నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి, వాటి ద్వారా టీటీడీ వసతి గదులను బుక్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆ గదులను అవసరమైన భక్తులకు భారీ ధరలకు విక్రయిస్తూ అక్రమ లాభాలు ఆర్జిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. వారి వాంగ్మూలం ఆధారంగా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఈ కేసులో తెలంగాణకు చెందిన ఎం. వేణుగోపాల్, టి. ఈశ్వర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దొంత రవీంద్రబాబు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంతోష్ కుమార్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. భక్తుల విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తూ టీటీడీ వసతి కేటాయింపు వ్యవస్థను మోసపూరితంగా ఉపయోగించుకున్న ఈ ముఠా గత కొంతకాలంగా ఇదే తరహా అక్రమాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది.

ఈ అక్రమ దందాను ఛేదించిన తిరుమల రెండో పట్టణ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులను తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి మురళీకృష్ణ అభినందించారు. ఈ సందర్భంగా భక్తులకు కీలక సూచనలు కూడా చేశారు. టీటీడీ వసతి గదులను అధికారిక కౌంటర్లు లేదా అధికారిక ఆన్‌లైన్ విధానాల ద్వారానే బుక్ చేసుకోవాలని, దళారులు లేదా మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎవరైనా గదులను అధిక ధరలకు విక్రయిస్తున్నా లేదా నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్నట్లు గమనిస్తే వెంటనే తిరుమల పోలీసులు లేదా టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. భక్తులను మోసం చేసే వారిపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed