పర్యటన పూర్తి షెడ్యూల్ వివరాలు:
ప్రధాని మోదీ ఈ మూడు దేశాలలో దౌత్యపరమైన చర్చలు, వాణిజ్య ఒప్పందాలు, ప్రవాస భారతీయుల సమావేశాల్లో పాల్గొంటారు.
1. ఇండోనేషియా (జులై 6-8, 2026):
తన పర్యటనలో భాగంగా, ముందుగా ప్రధాని మోదీ ఇండోనేషియా రాజధాని జకార్తా చేరుకుంటారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో (Prabowo Subianto) ఆహ్వానంతో ఆయన ఈ పర్యటన చేపడుతున్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. 2018లో రెండు దేశాల సంబంధాలు ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేరిన తర్వాత మోదీ ఇండోనేషియాకు ద్వైపాక్షిక పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. రెండు దేశాల మధ్య రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్య భాగస్వామ్యాలపై సమీక్ష నిర్వహిస్తారు. చారిత్రక, సాంస్కృతిక సంబంధాలకు ప్రతీకగా యోగ్యకార్తాలో ఉన్న ప్రసిద్ధ యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశం ‘ప్రంబనన్ (Prambanan) ఆలయాన్ని’ ఆయన సందర్శిస్తారు. అలాగే జకార్తాలో భారీ ప్రవాస భారతీయుల సభలో ఆయన ప్రసంగించనున్నారని PIB తెలిపింది.
ఇండోనేషియా పర్యటన ముగించుకొని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ (Anthony Albanese) ఆహ్వానం కారణంగా మోదీ.. మెల్‌బోర్న్ నగరానికి వెళ్తారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ సామ్ మోస్టిన్ (Sam Mostyn)తో ఆయన సమావేశమవుతారు. రెండు దేశాల అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో నిర్వహించే ‘ఇండియా-ఆస్ట్రేలియా సీఈవో ఫోరమ్’లో ఆయన పాల్గొని పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా వీసాల జారీలో జరుగుతున్న జాప్యం, వర్క్ మొబిలిటీ వంటి కీలక సమస్యలను పరిష్కరించే దిశగా రెండు దేశాల నేతలూ చర్చలు జరపనున్నారు. ఆస్ట్రేలియాలో ఉండే ప్రవాస భారతీయులు రెండు దేశాల మైత్రికి బలమైన పునాది అనీ, వారిని ఉద్దేశించి కూడా మోదీ ప్రసంగిస్తారనీ అధికారులు తెలిపారు.
3. న్యూజిలాండ్ (జులై 10-11, 2026):
చివరిగా జులై 10న మోదీ న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ చేరుకుంటారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ (Christopher Luxon) ఆహ్వానం కారణంగా ఆయన అక్కడ స్టేట్ విజిట్ పర్యటిస్తారు. గత 40 ఏళ్లలో.. అంటే.. 1986లో రాజీవ్ గాంధీ పర్యటన తర్వాత.. ఒక భారత ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ద్వారా వాణిజ్యం, ఎగుమతులను పెంచే అవకాశాలపై నేతలు చర్చిస్తారు. ఆక్లాండ్‌లో క్రీడా, వ్యాపార రంగ ప్రముఖులతో పాటు, ‘కియా ఓరా మోదీ (Kia Ora Modi)’ అనే పేరుతో 20 వేల మందికి పైగా హాజరయ్యే ప్రవాస భారతీయుల మహాసభలో మోదీ పాల్గొంటారు
ప్రధాని మోదీ చేపట్టిన ఈ 3 దేశాల పర్యటన వ్యూహాత్మకంగా భారత్‌కు ఎంతో ప్రయోజనకరం:
* ఇండో-పసిఫిక్ వ్యూహం: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించే ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’కి ఈ పర్యటన మరింత ఊతం ఇస్తుంది. చైనా ఆధిపత్యాన్ని సమతుల్యం చేయడానికి ఈ భాగస్వామ్యాలు అవసరం.
* క్రిటికల్ మినరల్స్ భద్రత: భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల (EV) బ్యాటరీలకు అత్యంత అవసరమైన నికెల్ (Nickel) వనరులు ఇండోనేషియాలో అత్యధికంగా లభిస్తాయి. అదే విధంగా ఆస్ట్రేలియా కూడా అరుదైన లిథియం తదితర ఖనిజ వనరులకు ప్రసిద్ధి. భవిష్యత్తులో క్లీన్ ఎనర్జీ కోసం నిర్దిష్ట దేశాలపై ఆధారపడకుండా, సరఫరా వ్యవస్థలను (Supply chains) బలోపేతం చేసుకోవడానికి ఈ దేశాలతో వాణిజ్య సంబంధాలు కీలకం.
* రక్షణ, సముద్ర భద్రత (Maritime Security): హిందూ మహాసముద్రం, పసిఫిక్ దీవుల మధ్య సముద్ర భద్రతను పటిష్టం చేయడంలో ఇండోనేషియా, ఆస్ట్రేలియాలతో భారతదేశ రక్షణ ఒప్పందాలు చాలా ముఖ్యమైనవి.
* విద్యార్థులు, ప్రవాసుల సంక్షేమం: లక్షల మంది భారతీయ విద్యార్థులు, నైపుణ్యం కలిగిన నిపుణులు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. వారి వీసా నిబంధనల సరళీకరణ, భద్రతకు ఈ పర్యటన ద్వారా ప్రభుత్వ స్థాయిలో స్పష్టమైన హామీ లభిస్తుంది.












