Last Updated:
Marriage Cheater: వివాహ వెబ్‌సైట్లలో ఉండేవారంతా మంచివారే అనుకోవద్దు. మోసగాళ్లు అడుగడుగునా ఉంటారు. ఆ మహిళ ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మి అన్ని రకాలుగా మోసపోయింది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లు సైబర్ నేరగాళ్లకు, మోసగాళ్లకు అడ్డాగా మారుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో పెళ్లి పేరుతో ఒక మహిళను దారుణంగా మోసం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ సైట్‌లో పరిచయమైన ఒక వ్యక్తి, తాను కోటీశ్వరుడినని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి.. 36 ఏళ్ల ఒక మహిళపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమె దగ్గర నుంచి ఏకంగా రూ.41.25 లక్షల నగదును కాజేసి పరారయ్యాడు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నందుర్బార్ ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల నిందితుడు ఒక ప్రముఖ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో నకిలీ ప్రొఫైల్ సృష్టించాడు. ఆ సైట్ ద్వారా ఠాణె జిల్లాలోని ఈస్ట్ కల్యాణ్‌కు చెందిన బాధిత మహిళకు వల వేశాడు. ఆ మహిళకు అప్పటికే వివాహమై, భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది. ఆమెకు ఒక బిడ్డ కూడా ఉన్నాడు. నిందితుడు తన ప్రొఫైల్‌లో తాను ఒక ప్రముఖ సివిల్ ఇంజినీర్‌ననీ, తనకు ఒక పెద్ద హోటల్ కూడా ఉందని తప్పుడు సమాచారం సైట్‌లో ఉంచాడు. ఈ క్రమంలో మహిళతో మాటలు కలిపి, ఆమెను పెళ్లి చేసుకుంటానని, ఆమె బిడ్డను కూడా తన సొంత బిడ్డలా అంగీకరిస్తానని నమ్మించాడు.
ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు, బాధిత మహిళ ఇంట్లోనే ఆమెపై అనేకసార్లు అత్యాచారానికి ఒడిగట్టాడని మహారాష్ట్ర పోలీసుల ఎఫ్ఐఆర్ నివేదిక తెలిపింది. శారీరకంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఆమెను తీవ్రంగా వాడుకున్నాడు. వివిధ అవసరాల పేరుతో ఆమె దగ్గర నుంచి ఏకంగా రూ.41 లక్షల 25 వేలు లాగాడు. అతని అకృత్యాలు అంతటితో ఆగలేదు.. ఫోర్జరీ పత్రాలు సృష్టించి.. ఆ మహిళకు చెందిన ఒక కారును అక్రమంగా అమ్మేందుకు యత్నించాడు. అలాగే ఆమెకు చెందిన మరో కారును అనధికారికంగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు.
తాజాగా అతను తరచూ తప్పించుకు తిరుగుతున్నాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాధిత మహిళ, తాను నిలువునా మోసపోయానని గ్రహించి వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఆమె కంప్లైంట్‌తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు గతంలో కూడా ఇలాంటి మోసపూరిత మ్యాట్రిమోనియల్ ప్రొఫైల్స్ ద్వారా ఇతర మహిళలను పెళ్లి పేరుతో మోసం చేసి ఉంటాడని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆన్‌లైన్ వేదికల్లో పరిచయమయ్యే వ్యక్తుల పట్ల ప్రజలు, ముఖ్యంగా ఒంటరి మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













