బౌలర్లకు చుక్కలు చూపించిన తెలంగాణ కుర్రాడు.. ఏకంగా 186 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసమే! | తెలంగాణ వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఆదిలాబాద్ కుర్రాడి సత్తా.. టీజీ 20 లీగ్‌ను ఒంటిచేత్తో శాసిస్తున్న మన తెలంగాణ బిడ్డ!

News18
News18

ఐపీఎల్ తరహాలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘టీజీ 20 క్రికెట్ లీగ్ 2026’ పోటీలు క్రీడాభిమానులను విశేషంగా అలరిస్తూ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన ఎంతో మంది యువ క్రికెటర్లు ఈ వేదికపై తమ సత్తా చాటుతున్నారు. ప్రత్యేకించి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన యువ బ్యాటర్ కొడిమెల హిమతేజ ఈ టోర్నీలో అద్భుతమైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఖమ్మం ఏసెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ యువ కెరటం మైదానంలో పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నంగా మారాడు. కుర్రాడి దూకుడు చూసి క్రీడాభిమానులు కేరింతలు కొడుతున్నారు.

ప్రతిభావంతుడైన హిమతేజను వేలంపాటలో ఖమ్మం ఏసెస్ ఫ్రాంచైజీ ఏకంగా ఎనిమిది లక్షల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అతను ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. తాజాగా సోమవారం మెదక్ ఫాల్కన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హిమతేజ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 57 బంతుల్లోనే 103 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఈ ఉత్కంఠ పోరులో ఖమ్మం ఏసెస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో అద్భుత ప్రదర్శన చేసి మెదక్ ఫాల్కన్స్‌పై 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హిమతేజ ఆడిన అద్భుతమైన షాట్లకు మైదానంలో ఉన్న ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.

ఇది కూడా చదవండి: LPG Cylinder: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాకుల మీద షాకులు.. మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా?

ఈ టోర్నీలో హిమతేజ బ్యాటింగ్ గణాంకాలు అబ్బురపరుస్తున్నాయి. ఏకంగా 186 స్ట్రైక్ రేట్‌తో చెలరేగుతూ లీగ్‌లో ఇప్పటివరకు మొత్తం 430 పరుగులు సాధించి టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ‘ఆరెంజ్ క్యాప్’ సొంతం చేసుకున్నాడు. హిమతేజ తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ ఆటగాడు అభిరథ్ రెడ్డి 379 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత వరంగల్ వారియర్స్ సభ్యుడు అమన్ రావు 266 పరుగులతో, నల్గొండ నైట్స్ ఆటగాడు గౌరవ్ రెడ్డి 258 పరుగులతో, మెదక్ ఫాల్కన్స్ బ్యాటర్ విక్రమ్ నాయక్ గుగులోత్ 245 పరుగులతో తదుపరి స్థానాల్లో నిలిచారు. ఈ లీగ్‌లో పరుగుల కోసం వీరంతా తీవ్రంగా పోటీ పడుతుండటం టోర్నీకి మరింత శోభను తీసుకొచ్చింది.

ఇది కూడా చదవండి: Ration Card News: కొత్త రేషన్ కార్డు పొందాలనుకునే వారికి బిగ్ షాక్.. వెంటనే ఈ విషయం తెలుసుకోండి!

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయాలన్న సదుద్దేశంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) గత నెల 21వ తేదీన ఈ టీజీ 20 లీగ్‌ను అట్టహాసంగా ప్రారంభించింది. ఇందులో మొత్తం ఎనిమిది జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్, రంగారెడ్డి రైజర్స్, నల్గొండ నైట్స్, వరంగల్ వారియర్స్, మెదక్ ఫాల్కన్స్, కరీంనగర్ డైమండ్స్, హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్లు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. లీగ్ దశ నుంచి ప్లేఆఫ్స్ వరకు సాగే ఈ టోర్నమెంట్ తుది పోరు ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

క్రికెట్ పట్ల తీవ్రమైన మక్కువతో శ్రమిస్తున్న హిమతేజ.. టీజీ 20 లీగ్ వేదికగా అద్భుతమైన ప్రదర్శన చేస్తుండటంతో స్థానికంగా పండుగ వాతావరణం నెలకొంది. మైదానంలో ఆడుతున్న తీరు చూసి ఆదిలాబాద్‌లోని అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తగిన ఫలం దక్కుతోందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో హిమతేజ భవిష్యత్తులో జాతీయ స్థాయిలోనూ మరింత అద్భుతంగా రాణించి తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకురావాలని అందరూ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. తగిన ప్రోత్సాహం అందిస్తే యువ క్రీడాకారులు అద్భుతాలు సృష్టిస్తారని ఈ టోర్నీ నిరూపించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports