Last Updated:
జర్మనీకి వెళ్తున్న రయనైర్ విమానంలో ఇంజిన్ లోపం కారణంగా కిటికీ అద్దం పగిలి క్యాబిన్లో గాలి ఒత్తిడి తగ్గిపోయింది. ఈ ఘటనలో కిటికీ పక్కన కూర్చున్న 61 ఏళ్ల ప్రయాణికుడు సగం వరకు బయటకు లాగబడగా, అతడిని భార్య పట్టుకుని కాపాడింది.
జర్మనీకి వెళ్తున్న రయనైర్ (Ryanair) విమానంలో శుక్రవారం (జూలై 10) ఉదయం తీవ్ర ఉత్కంఠ చోటుచేసుకుంది. ప్రయాణ మధ్యలో ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో దాని నుంచి విడిపోయిన లోహపు ముక్క విమానం శరీర భాగాన్ని (ఫ్యూజలాజ్) ఢీకొట్టింది. దీంతో ఓ కిటికీ అద్దం పూర్తిగా పగిలిపోవడంతో పాటు విమానంలోని గాలి ఒత్తిడి ఒక్కసారిగా తగ్గిపోయింది. ఈ ఘటనలో కిటికీ పక్కన కూర్చున్న ఓ ప్రయాణికుడు సగం వరకు బయటకు లాగబడగా, అత్యవసరంగా విమానాన్ని గ్రీస్‌లో ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
రయనైర్కు చెందిన FR1879 విమానం గ్రీస్‌లోని థెస్సలోనికి అంతర్జాతీయ విమానాశ్రయం (మాసిడోనియా ఎయిర్పోర్ట్) నుంచి జర్మనీలోని మెమ్మింగెన్ నగరానికి బయల్దేరింది. ఉత్తర మాసిడోనియా గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్‌లో తీవ్రమైన లోపం ఏర్పడింది.
🔴 [ Urgent ]
Un Boeing 737-800 opérant le vol Ryanair FR1879 de Thessalonique à Memmingen s’est posé en urgence en Grèce.
Un hublot s’est brisé lors de la montée au niveau 150, déclenchant une dépressurisation de la cabine et le déploiement des masques à oxygène.
Un passager… pic.twitter.com/Ivw9rEOu90
— air plus news (@airplusnews) July 10, 2026
విమానయాన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజిన్ నుంచి విడిపోయిన ఒక లోహపు భాగం విమానం పక్క భాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రయాణికుడు కూర్చున్న కిటికీ అద్దం పగిలిపోయింది. వెంటనే క్యాబిన్లో గాలి ఒత్తిడి తగ్గిపోవడంతో ఆక్సిజన్ మాస్కులు ఆటోమేటిక్‌గా బయటకు వచ్చాయి. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కిటికీ పక్కన కూర్చున్న 61 ఏళ్ల సెర్బియా దేశానికి చెందిన వ్యక్తి ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. కిటికీ అద్దం పగిలిపోవడంతో క్యాబిన్‌లోని గాలి వేగంగా బయటకు వెళ్లింది. ఆ గాలి ఒత్తిడికి ఆయన శరీరం పైభాగం కిటికీ బయటకు లాగబడింది. ఈ ఘటనపై పాన్హెలెనిక్ ఫెడరేషన్ ఆఫ్ పబ్లిక్ హాస్పిటల్ ఎంప్లాయీస్ (POEDIN) అధ్యక్షుడు మిచాలిస్ జియానాకోస్ స్పందించారు. గాలి ఒత్తిడికి ప్రయాణికుడు బయటకు వెళ్లిపోకుండా ఆయన భార్య బలంగా పట్టుకుని నిలిపిందని తెలిపారు. ఆమె సమయస్ఫూర్తి వల్లే మరింత పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు.
పరిస్థితి తీవ్రంగా మారడంతో పైలట్లు వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించి విమానాన్ని వేగంగా కిందికి దించి తిరిగి థెస్సలోనికి విమానాశ్రయానికి మళ్లించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యే సమయానికి రన్‌వేపై అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయి.
గాయపడిన 61 ఏళ్ల ప్రయాణికుడిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ఆయన భుజాలు, శరీరం పైభాగంలో తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. మరో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు, షాక్‌కు గురికావడంతో వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. మిగతా ప్రయాణికులను సురక్షితంగా టెర్మినల్‌కు తరలించారు.
ఈ ఘటనపై రయనైర్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం (జూలై 10) ఉదయం థెస్సలోనికి నుంచి మెమ్మింగెన్‌కు బయల్దేరిన విమానంలో ప్రయాణ మధ్యలో ఒక కిటికీ ఊడిపోవడంతో తిరిగి థెస్సలోనికికి మళ్లించామని తెలిపింది.
విమానం ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులను టెర్మినల్‌కు తరలించామని పేర్కొంది. ఒక ప్రయాణికుడు వైద్య సహాయం కోరడంతో వెంటనే చికిత్స అందించినట్లు వెల్లడించింది. అలాగే, మిగతా ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకునేందుకు వెంటనే మరో ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఎందుకు ఏర్పడింది? లోహపు ముక్క ఎలా విడిపోయింది? కిటికీ ఎలా ధ్వంసమైంది? అనే అంశాలపై విమాన భద్రతా అధికారులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే ఘటనకు అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














