Trade Deal: టారిఫ్ వార్.. యూఎస్ 12.5% అదనపు సుంకాల ప్రతిపాదన.. దీటుగా బదులిచ్చిన భారత్! | | ACTPnews

Trade Deal: టారిఫ్ వార్.. యూఎస్ 12.5% అదనపు సుంకాల ప్రతిపాదన.. దీటుగా బదులిచ్చిన భారత్! |


అసలేమిటీ వివాదం?

బలవంతపు శ్రమ, మితిమీరిన పారిశ్రామిక సామర్థ్యం వంటి ఆరోపణలపై భారత్ సహా 60 దేశాలపై ఈ ఏడాది మార్చిలో యూఎస్‌టీఆర్ (USTR) ‘సెక్షన్ 301’ కింద రెండు దర్యాప్తులను ప్రారంభించింది. జూన్ 3న ఈ దర్యాప్తు ఫలితాలను వెల్లడించిన యూఎస్‌టీఆర్, ఆయా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అదనపు సుంకాలు విధించాలని ప్రతిపాదించింది.

కెనడా, ఈక్వెడార్, యూరోపియన్ యూనియన్, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10% సుంకాన్ని.. అలాగే భారత్, చైనాలతో కూడిన 54 దేశాలపై 12.5% అదనపు సుంకాన్ని ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనలు ఇంకా ఖరారు కాలేదు.

అమెరికా దర్యాప్తులో లోపాలున్నాయి: భారత్

జులై 8న జరిగిన బహిరంగ విచారణలో భారత వాణిజ్య శాఖ జాయింట్ సెక్రటరీ బ్రిజ్ మోహన్ మిశ్రా మాట్లాడుతూ, అమెరికా చేపట్టిన ఈ దర్యాప్తులో ఎన్నో వైరుధ్యాలు, లోపాలు ఉన్నాయని వేలెత్తి చూపారు. బలవంతపు శ్రమను నిర్మూలించడాన్ని భారతదేశం ఒక రాజ్యాంగబద్ధమైన బాధ్యతగా, అంతర్జాతీయ చట్టంగా భావిస్తుందని స్పష్టం చేశారు.

ట్రేడ్ యాక్ట్ లోని సెక్షన్ 301(d) కింద నిర్దేశించిన చట్టపరమైన ప్రమాణాలను యూఎస్‌టీఆర్ పాటించలేదని మిశ్రా వాదించారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా 46 దేశాలను ఒకే కేటగిరీ కింద గుంపగుత్తగా చేర్చి, దేశవ్యాప్త టారిఫ్‌లు విధించడాన్ని ఆయన తప్పుపట్టారు. నిర్దిష్టమైన రంగాలు లేదా దేశాల వారీగా ఎలాంటి సాక్ష్యాలు చూపకుండా, కేవలం స్థూల గణాంకాల ఆధారంగానే ఈ దర్యాప్తు సాగిందని ఆరోపించారు. ఏదైనా సమస్య ఉంటే భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య చర్చల వేదికపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ ఏకపక్ష దర్యాప్తు టారిఫ్ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు.

భారతీయ బియ్యానికి మినహాయింపు ఇవ్వాలి

వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయ ఫస్ట్ సెక్రటరీ శ్రేయాన్స్ గుప్తా.. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) తరఫున హాజరై యూఎస్‌టీఆర్ అంచనాలను అభ్యంతరపెట్టారు. బలవంతపు శ్రమతో భారత్‌లోకి దిగుమతి అయిన బియ్యం వల్ల అమెరికా దేశీయ విక్రయాలు, ఎగుమతుల పోటీ దెబ్బతింటోందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. అలాంటి బియ్యం భారత్ నుంచి ఎగుమతి కాకుండా కఠినమైన నియంత్రణలు, తనిఖీలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ దర్యాప్తు నుంచి భారత్‌ను మినహాయించాలని, ఒకవేళ ప్రక్రియ కొనసాగినా భారతీయ బియ్యానికి ఈ సుంకం నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

ఆందోళన వ్యక్తం చేసిన ఫిక్కీ (FICCI)

భారత పరిశ్రమల సమాఖ్య ‘ఫిక్కీ’ కూడా ఈ ప్రతిపాదనను పునఃసమీక్షించాలని కోరింది. “అదనపు సుంకాలు విధిస్తే అది భారతీయ ఎగుమతిదారులకే కాకుండా అమెరికా తయారీదారులు, దిగుమతిదారులు, రిటైలర్లు మరియు చివరికి అమెరికన్ వినియోగదారులపై కూడా భారాన్ని పెంచుతుంది” అని పేర్కొంది. భారతదేశంలోని చట్టపరమైన రక్షణలు, పటిష్టమైన సప్లై చైన్ మరియు వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా ఈ అదనపు టారిఫ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

మార్కెట్ ప్రవేశాన్ని విస్తరించడం, టారిఫ్ అడ్డంకులను తగ్గించడం మరియు ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా గత 18 నెలలకు పైగా అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న తరుణంలో అమెరికా ఈ విధమైన ప్రతిపాదనలు చేయడం గమనార్హం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports