Last Updated:
డీకే శివకుమార్ వ్యాఖ్యలపై టీటీడీ భాను ప్రకాష్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. తిరుమల సంప్రదాయాలు మార్చలేమని, రాజకీయాలకు అతీతమని స్పష్టం చేశారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు తిరుమలలో కొత్త చర్చకు దారితీశాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి రాజకీయ నాయకులకు కూడా నిత్యహారతి దర్శనం కల్పించాలని ఆయన చేసిన సూచనపై టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుమల ఆలయం శతాబ్దాలుగా ఆగమ శాస్త్రాలు, సంప్రదాయాల ఆధారంగా నిర్వహించబడుతున్న పవిత్ర క్షేత్రమని, రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఆచారాలను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
నిత్యహారతి దర్శనం అనేది సాధారణ దర్శనం కాదని, మైసూరు మహారాజు వంశానికి సంప్రదాయబద్ధంగా లభిస్తున్న ప్రత్యేక గౌరవమని భాను ప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు. ఇది చారిత్రకంగా కొనసాగుతున్న ఆనవాయితీ అని, అలాంటి గౌరవాన్ని రాజకీయ నాయకులకు కూడా ఇవ్వాలని కోరడం సమంజసం కాదన్నారు. తిరుమలలో అమలవుతున్న ప్రతి సంప్రదాయానికి చరిత్ర, ఆధ్యాత్మికత, ఆగమ శాస్త్రాల ఆధారం ఉందని, వాటిని రాజకీయ కోణంలో చూడకూడదని ఆయన పేర్కొన్నారు.
తిరుమల వంటి మహా పుణ్యక్షేత్రాన్ని రాజకీయ వేదికగా మార్చే ప్రయత్నాలు ఎవరూ చేయకూడదని భాను ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకసారి రాజకీయ నాయకుల కోసం ప్రత్యేక గౌరవాల విషయంలో కొత్త సంప్రదాయాలకు శ్రీకారం చుడితే, భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇదే తరహా డిమాండ్లు రావచ్చని హెచ్చరించారు. కర్ణాటకకు అవకాశం ఇస్తే, రేపు తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి ప్రత్యేక దర్శనాలు కోరే పరిస్థితి ఏర్పడుతుందని, చివరకు ఆలయ సంప్రదాయాలపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందన్నారు.
తమ పార్టీ నాయకులను సంతోషపెట్టడానికి దేవాలయ సంప్రదాయాలను ఉపయోగించుకోవడం సరికాదని భాను ప్రకాష్ రెడ్డి విమర్శించారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన తిరుమల ఆలయ గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆలయ ఆచారాలను మార్చాలనే ఆలోచన భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
టీటీడీ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకూ తలొగ్గదని భాను ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీవారి ఆలయ గౌరవం, సంప్రదాయాలు, ఆగమ శాస్త్రాల పరిరక్షణ విషయంలో ఎప్పటికీ రాజీ ఉండదని చెప్పారు. డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై రేపు జరగనున్న ధార్మిక పరిషత్ సమావేశంలో సమగ్రంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అలాగే డీకే శివకుమార్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, శ్రీవారి భక్తుల మనోభావాలను గౌరవించాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
Tirupati,Chittoor,Andhra Pradesh













