ఈ20 ఇంధనంతో వాహనాల ఇంజిన్లు పాడవుతాయనేది అపోహే: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ఈ20 ఇంధనంతో వాహనాల ఇంజిన్లు పాడవుతున్నాయన్న వాదనల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అవన్నీ కేవలం అపోహలేనని కొట్టిపారేశారు. ఇంజిన్లు పాడవుతున్నాయని ప్రభుత్వానికి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్పారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ (TOI) పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. వాహనదారులకు ఆయన కీలక సూచన చేశారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడటం ఇష్టం లేని వారు 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్‌ను కొనుగోలు చేయవచ్చని, అయితే అందుకు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా ఇప్పటికే 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకున్నామని, అన్ని పెట్రోల్ బంకుల్లో ఈ20 (E20) ఇంధనం అందుబాటులో ఉందని ఆయన గుర్తు చేశారు. అన్ని బంకుల్లో ఈ10 పెట్రోల్ ఇవ్వడం ఇప్పుడు సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. ఇథనాల్ లేని సాధారణ పెట్రోల్ కావాలంటే కచ్చితంగా అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిందేనని గడ్కరీ వెల్లడించారు.













