ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించమని నియమించిన గవర్నమెంట్ అధికారులే అవినీతి సొమ్ముకు కక్కూర్తి పడి కోట్లకు కోట్లు అక్రమ సొమ్ము పోగేసుకుంటున్నారు. తాజాగా ఈ లిస్టులో మరో కరప్షన్ ఆఫీసర్ చేరిపోయారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) చీఫ్ ఇంజనీర్ రవీందర్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడినట్లుగా తేలింది. మంగళవారం ఏసీబీ అధికారులు రవీందర్ అవినీతి చిట్టా ఏపెన్ చేశారు. అతని ఇల్లు, ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్, నగలు, బంగారు ఆభరణాలు, బ్యాంకుల్లో పెట్టుబడులకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. ఏడాది క్రితమే HMDA చీఫ్ ఇంజనీర్‌గా బాధ్యతలు చేపట్టిన రవీందర్ అతి తక్కువ కాలంలోనే సుమారు 100 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించినట్లుగా నిర్ధారించారు. ఇక రవీందర్ ఇంట్లో నిర్వహించిన సోదాల్లో రూ.45 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, కిలోన్నర బంగారు నగలతో పాటు 12.5 కిలోల వెండి ఆభరణాలు, శంషాబాద్, కృష్ణాపూర్ , పసుమాములలో అతి విలువైన ఐదు ప్లాట్లు కొనుగోలు చేసినట్లుగా తేల్చారు.
హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో తనిఖీలు పూర్తి చేసిన ఏసీబీ అధికారులు అతడ్నిఅదుపులోకి తీసుకున్నారు. మరికాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. కరప్షన్ ఆఫీస్‌గా పట్టుబడిన రవీందర్ ఆధ్వర్యంలోనే ఎలివేటెడ్ కారిడార్ల టెండర్ల కేటాయింపులు, ఔటర్ రింగ్ రోడ్డు లీజు వ్యవహారాలు కూడా జరిగినట్లుగా తేల్చారు. వీటి ద్వారానే ఇంత పొద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లుగా రాబట్టారు.
ఇంజనీర్ నివాసం, ఆఫీసులతో పాటు అతని బంధువులు, సహచరులు, బినామీలుగా భావించబడుతున్న వ్యక్తుల ఆస్తుల వద్ద ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాలో భారీ మొత్తంలో స్థిర, చరాస్తులను గుర్తించింది ఏసీబీ. రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా, స్వాధీనం చేసుకున్న ఈ ఆస్తుల విలువ రూ. 9.24 కోట్లు అని అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌కు పశ్చిమ దిశలో అభివృద్ధి కారిడార్ పరిధిలో రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పెరగడం వల్ల, స్వాధీనం చేసుకున్న ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.
ఏసీబీ జప్తు చేసిన ఆస్తులలో రంగారెడ్డి జిల్లాలోని కొండకల్, కిష్టాపూర్ , పాసమైల ప్రాంతాల్లోని ఐదు ప్లాట్లతో పాటు నార్సింగి,నానక్‌రామ్‌గూడలో నాలుగు నివాస ఫ్లాట్లు, శంషాబాద్ సమీపంలోని గూడూరు గ్రామంలో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి, మొకిలలో 300 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న పాక్షికంగా పూర్తయిన విల్లా ఒకటి ఉందని తేల్చారు. అలాగే కొండాపూర్‌లోని మసీద్ బండా వద్ద ఉన్న G+4 కమర్షియల్ బిల్డింగ్ కూడా రవీందర్ అక్రమాస్తుల చిట్టాలోనిదేనని తేల్చారు. నిందితుడైన అధికారి రవీందర్‌ని జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. అదనపు ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు, అనుమానిత బినామీ ఆస్తులను పరిశీలించేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ పేర్కొంది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డి కూడబెట్టిన సంపద చూసి ఏసీబీ అధికారులకే మతిపోయింది. తెలంగాణ, కర్ణాటకల్లోని 16 ప్రాంతాల్లో ఏసీబీ జరిపిన సోదాల్లో 44 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్, బెంగళూరులో కమర్షియల్ ల్యాండ్, కేజీల కొద్దీ బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. చార్ ధామ్ యాత్రకు ముందు ఆయన రాసిన డైరీలో లెక్కల ప్రకారం ఓపెన్ మార్కెట్లో భీంరెడ్డి అక్రమ సంపాదన రూ.200 – 300 కోట్ల విలువ చేస్తున్నట్లుగా తేల్చారు. దీంతో ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా భీమ్‌రెడ్డికి చెందిన ఇళ్లు, ఆఫీసులతో పాటు ఫ్రెండ్స్, బంధువుల నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించి ఈ అక్రమాస్తులను గుర్తించారు. సోదాల్లో లభించిన ఆధారాలు, పత్రాల పరిశీలన అనంతరం భీమ్‌రెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు.
గత నెల జూన్‌లో ఇదే విధంగా అవినీతి నిరోదకశాఖ కళ్లుగప్పి కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడిన నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెండ్ కొమ్మూరి మల్లారెడ్డిని ఏసీబీ పట్టుకుంది. ఆయన కూడా రూ. 3 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టినట్లుగా గుర్తించింది. బాధితులు ఏసీబీకి ఇచ్చిన కంప్లైంట్‌తో దూకుడు పెంచిన అధికారులు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. రూ.3 కోట్ల విలువైన స్థిర, చరాస్తుల్ని గుర్తించారు.
ఇక స్థిరాస్తుల లిస్టులో 4 లివింగ్ హౌస్‌లు, ఒక కమర్షియల్ బిల్డింగ్, 8 ఓపెన్ ప్లాట్లు, 10.23 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లుగా తేల్చారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే వీటి విలువ 3 కోట్లుగా తేల్చింది ఏసీబీ. ఓపెన్ మార్కెట్లో వీటి విలువ అంతకు మించే ఉంటుందని చెప్పారు. ఇవి మాత్రమే కాదు మల్లారెడ్డికి హైదరాబాద్ అల్వాల్‌లోని ఆయన ఇంట్లో రూ.3.31 లక్షల నగదు, బ్యాంకు అకౌంట్లలో రూ.50 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు ఒక ఎస్యూవీ కారు, స్కూటర్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు.













