Last Updated:
కమర్షియల్ చిత్రాలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ తమన్నా.. తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఆ వివరాలు చూస్తే..
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. కమర్షియల్ చిత్రాలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న ఈ స్టార్ హీరోయిన్ తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. హిందీలో భారీ విజయాన్ని అందుకున్న హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘రాగిణి ఎంఎంఎస్’ మూడో భాగం ‘రాగిణి 3’లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కొద్ది రోజులుగా దీనిపై వస్తున్న ప్రచారానికి తెరదించుతూ, ఈ ప్రాజెక్ట్ షూటింగ్ లండన్‌లో అధికారికంగా ప్రారంభమైంది.
చిత్రీకరణ ప్రారంభమైన విషయాన్ని తెలియజేస్తూ తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో లండన్ సెట్స్ నుంచి ‘డే 1’ అని రాసి ఉన్న ‘రాగిణి 3’ క్లాప్‌బోర్డ్ ఫొటోను షేర్ చేశారు. వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు శశాంక్ ఘోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఏక్తా కపూర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ పాత్ర కోసం ముందుగా నోరా ఫతేహిని అనుకున్నప్పటికీ, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ క్రేజీ ఆఫర్ తమన్నాను వరించినట్లు తెలుస్తోంది. ఇందులో తమన్నాతో పాటు జునైద్ ఖాన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.
బాలీవుడ్‌లో ‘రాగిణి’ హారర్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అయితే ఈసారి దీన్ని ఒక ‘డేట్ నైట్ హారర్’ ఎంటర్‌టైనర్‌గా సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. కేవలం భయపెట్టడమే కాకుండా, రొమాన్స్, కామెడీ, అనుకోని ట్విస్టులతో సరికొత్త డైరెక్షన్‌లో ఈ సినిమా సాగనుందని మేకర్స్ తెలిపారు. లండన్‌లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత ఇతర లొకేషన్లలో షూట్ జరగనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2027లో ఈ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
‘రాగిణి ఎంఎంఎస్’ సిరీస్ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. 2011లో వచ్చిన మొదటి భాగంలో రాజ్‌కుమార్ రావ్, కైనాజ్ మోటివలా నటించి మెప్పించారు. ఆ తర్వాత 2014లో సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో ‘రాగిణి ఎంఎంఎస్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో సన్నీ లియోన్ పండించిన గ్లామర్, ముఖ్యంగా ‘బేబీ డాల్’ ఐటెం సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఓటీటీలో వచ్చిన రెండు సీజన్లు కూడా యువతను ఆకట్టుకున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్న ఈ మూడో భాగంలో తమన్నా ఎంట్రీ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇటీవల ‘కావాలా’, ‘ఆజ్ కీ రాత్’ సాంగ్స్‌తో కుర్రకారును ఊపేసిన తమన్నా, ‘రాగిణి 3’లో తన యాక్టింగ్, గ్లామర్‌తో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jul 17, 2026 10:31 AM IST














