గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పీఎం కిసాన్, పీఎం సూర్య సరోవర్ పథకాలకు కోట్ల రూపాయల నిధులు | | ACTPnews

పీఎం మోదీ ఫైల్ ఫోటో


Last Updated:

కేంద్ర మంత్రివర్గం రూ.4.50 లక్షల కోట్ల విలువైన ఐదు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో పీఎం-కిసాన్ పథకాన్ని 2030-31 వరకు మరో ఐదేళ్లు పొడిగించడంతో పాటు రూ.3.15 లక్షల కోట్ల నిధులు కేటాయించింది.

పీఎం మోదీ ఫైల్ ఫోటో
పీఎం మోదీ ఫైల్ ఫోటో

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దేశ అభివృద్ధికి కీలకమైన పలు నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం రూ.4.50 లక్షల కోట్ల విలువైన ఐదు ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతుల సంక్షేమం, పునరుత్పాదక ఇంధనం, క్రీడలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ఈ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.

మరో ఐదేళ్లు కొనసాగనున్న పీఎం-కిసాన్ పథకం

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకాన్ని 2026-27 నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు మరో ఐదేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.3.15 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను మంజూరు చేసింది.

ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ మొత్తం రూ.2,000 చొప్పున మూడు విడతల్లో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో అందజేస్తారు. విత్తనం వేయడం, పంట కోత వంటి కీలక వ్యవసాయ దశల్లో రైతులకు ఆర్థిక సహాయం అందించడం, అధిక వడ్డీ రుణాలపై ఆధారపడకుండా చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని కేంద్రం తెలిపింది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 23 విడతల ద్వారా రూ.4.47 లక్షల కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 23వ విడతలో మాత్రమే రూ.18,984 కోట్లకు పైగా విడుదల చేయగా, 9.49 కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా రైతులకు అండగా నిలిచిన ఈ పథకం కింద రూ.1.71 లక్షల కోట్లకు పైగా నిధులు విడుదల చేసి వ్యవసాయ కార్యకలాపాలు నిరంతరంగా కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించింది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం ద్వారా ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతోంది.

పీఎం సూర్య సరోవర్ యోజనకు ఆమోదం

దేశంలో పరిశుభ్రమైన ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య సరోవర్ యోజనకు కూడా ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం రూ.5,070 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ పథకంలో చెరువులు, జలాశయాలు వంటి నీటి వనరులపై సౌర విద్యుత్ ప్యానెల్లు ఏర్పాటు చేయనున్నందున భూమి సేకరణ అవసరం ఉండదు. అలాగే నీటి ఆవిరీభవనం తగ్గి సాగునీటి నిల్వలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. తేలియాడే సౌర వ్యవస్థల తయారీని దేశీయంగా ప్రోత్సహించడం ద్వారా సుమారు 17 వేల కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించబడతాయని కేంద్రం పేర్కొంది. కార్బన్ ఉద్గారాల తగ్గుదలకు కూడా ఈ పథకం దోహదపడుతుందని వివరించింది.

క్రీడలు, మౌలిక సదుపాయాలకు భారీ నిధులు

దేశంలో క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు ఖేలో ఇండియా మరియు జాతీయ క్రీడా సమాఖ్య పథకం కోసం కలిపి రూ.36,441 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రం ప్రకటించింది.

అదే విధంగా సముద్ర మంథన్ ప్రాజెక్టు కోసం రూ.84,084 కోట్లు కేటాయించింది. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో భాగంగా ట్విన్ ట్యూబ్ టన్నెల్ నిర్మాణానికి రూ.9,779 కోట్లు ఆమోదించింది.

ఆర్థికాభివృద్ధే ప్రధాన లక్ష్యం

రైతుల ఆదాయాన్ని పెంచడం, పరిశుభ్రమైన ఇంధన రంగాన్ని విస్తరించడం, క్రీడలకు ప్రోత్సాహం అందించడం, దేశ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడం ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ఐదు మెగా ప్రాజెక్టుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు వివిధ రంగాలు ప్రపంచ స్థాయిలో పోటీ పడే సామర్థ్యాన్ని మరింత పెంచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports