Last Updated:
నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “అదే నీవు అదే నేను”. ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..
టాలీవుడ్‌లో ఇప్పుడు థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది. అందులోనూ రొమాంటిక్ థ్రిల్లర్ అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరుగుతుంది. సరిగ్గా ఇదే జానర్‌ను ఎంచుకుని, నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “అదే నీవు అదే నేను”. శ్రీ లక్ష్మీ వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై కాండ్రేగుల గోవిందు నిర్మాణంలో, దర్శకుడు కొండల్ రూపొందించిన ఈ చిత్రంలో ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాలతో పాటు తన్వి నేగి, సహర్ కృష్ణన్ ప్రధాన పాత్రలు పోషించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ ప్రారంభమే ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. హీరోయిన్ శ్రీవల్లి (తన్వీ నేగి) తన కారులో రెండు మృతదేహాలను ఒక ఫార్మ్ హౌస్‌కు తీసుకురావడంతో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. నగరంలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో నివసించే కొత్త జంట సాగర్ (యశ్వంత్ పెండ్యాల), శ్రీవల్లిల కథ పరిచయం అవుతుంది. సాగర్ ఓ బిజీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా, శ్రీవల్లి హౌస్ వైఫ్‌గా ఉంటుంది. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న పని ఒత్తిడి (Work Stress) భార్యాభర్తల మధ్య ఎలా దూరం పెంచుతుందో ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు. ఒత్తిడి కారణంగా సాగర్ తన భార్యకు శారీరకంగా, మానసికంగా దగ్గర కాలేకపోతాడు.
సరిగ్గా ఈ సమయంలో వారి ఎదురు ఫ్లాట్‌లోకి కార్తీక్ (త్రినాథ్ వర్మ) అనే చలాకీ యువకుడు వస్తాడు. కెనడాలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే కార్తీక్, ప్రాజెక్ట్ పని మీద హైదరాబాద్ వస్తాడు. తన ఆకర్షణీయమైన మాట తీరుతో శ్రీవల్లికి దగ్గరవుతాడు. భర్త నుంచి తగిన సమయం, ప్రేమ దొరక్కపోవడంతో శ్రీవల్లి.. కార్తీక్‌కు ఆకర్షితురాలవుతుంది. తను చేసేది తప్పని తెలిసినా ఆ బంధం నుంచి బయటపడలేకపోతుంది. చివరకు ఈ ముక్కోణపు ప్రేమకథలో ఊహించని నిజాలు వెలుగుచూస్తాయి. శ్రీవల్లి తెలుసుకున్న ఆ భయంకరమైన నిజాలు ఏంటి? కారులో ఉన్న ఆ రెండు బాడీలు ఎవరివి? అనేది మిగతా కథ.
‘కమిటీ కుర్రోళ్లు’ లాంటి హిట్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల ఈ సినిమాలో తమ పాత్రల్లో జీవించారు. పక్కింటి కుర్రాడిగా, కాస్త గ్రే షేడ్స్ ఉన్న కార్తీక్ పాత్రలో త్రినాథ్ వర్మ నటన బాగుంది. అలాగే మెచ్యూరిటీ ఉన్న భర్త పాత్రలో యశ్వంత్ నటన ఆకట్టుకుంటుంది. ఇక ఈ కథకు ప్రధాన స్తంభం శ్రీవల్లి పాత్ర. ఈ పాత్రలో అనేక లేయర్స్, ఎమోషన్స్ ఉన్నాయి, వాటిని తన్వీ నేగి చాలా అద్భుతంగా పండించింది. మరో హీరోయిన్ సహర్ కృష్ణన్ రూబీ పాత్రలో గ్లామర్ అద్దగా, బిత్తిరి సత్తి, సూర్యతేజ కామెడీ సినిమాకు రిలీఫ్ ఇచ్చింది.
ఒక క్రైమ్ లేదా థ్రిల్లర్ సినిమా అంటే కచ్చితంగా పోలీసుల దర్యాప్తు ఉంటుంది. కానీ ఎక్కడా పోలీస్ క్యారెక్టర్ లేకుండా ఒక థ్రిల్లర్ కథను నడిపించడంలో దర్శకుడు కొండల్ సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్‌లో వేసిన చిక్కుముడులను సెకండాఫ్‌లో చాలా లాజికల్‌గా రివీల్ చేసిన తీరు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కొన్ని చోట్ల బోర్ ఫీలింగ్ కలిగినా ఎప్పటికప్పుడు కథను గ్రిప్పింగ్ గా ముందుకు నడిపించాడు. నిమ్మల జయపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ తీసుకురాగా, ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చాలా క్రిస్ప్‌గా ఉంది. కనిష్క అందించిన సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతం (BGM) థ్రిల్లర్ ఫీల్‌ను రెట్టింపు చేసింది. నిర్మాత కాండ్రేగుల గోవిందు ఎక్కడా రాజీ పడకుండా భారీ నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించారు.
చివరగా.. “పెళ్లికి ముందు ప్రేమ.. నువ్వు లేకపోతే నేను బతకలేను అంటుంది. కానీ, పెళ్లి తర్వాత ప్రేమ.. నేను బ్రతికేదే నీకోసం అంటుంది.” అనే గొప్ప సందేశంతో, వివాహ బంధంలోని పవిత్రతను చాటిచెప్పేలా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచాడు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తీసిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చూడదగిన చిత్రమే.
రేటింగ్: 2.75
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














