Last Updated:
యశ్ హీరోగా వస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ లో కియారా అద్వానీ రోల్, ఆమె గ్లామర్ డోస్ చూసి అంతా షాకయ్యారు. ఈ నేపథ్యంలో తాను ఈ రోల్ ఎందుకు చేయాల్సి వచ్చిందనేది చెబుతూ ఓపెన్ అయింది ఈ ముద్దుగుమ్మ.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అడ్వాణీ (Kiara Advani) ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కన్నడ రాకింగ్ స్టార్ యశ్ సరసన ‘టాక్సిక్’ (Toxic) సినిమా చేస్తున్నారు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యశ్ నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్‌కు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కియారా ‘నదియా’ అనే అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు.
అయితే, ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని ‘తబాహీ’ పాట, పోస్టర్లపై నెట్టింట తీవ్ర స్థాయిలో విమర్శలు, ట్రోల్స్ నడిచాయి. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే నడిచింది. తాజాగా ఈ విమర్శలను కొట్టిపారేసిన కియారా.. అసలు తాను ఈ ప్రాజెక్టును ఎందుకు అంగీకరించాల్సి వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
“దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ కథ చెప్పినప్పుడు, అందులో నా పాత్రను మలిచిన తీరు చూసి నేను ఆశ్చర్యపోయాను. ఒక నటిగా నేను ప్రదర్శించాలనుకునే అన్ని కోణాలు ఆ పాత్రలో ఉన్నాయి. ఒకే పాత్రలో ధైర్యం, బలం, బలహీనత, సున్నితత్వం, కొంచెం పిచ్చితనం.. ఇలా భిన్నమైన భావోద్వేగాలను పండించే అద్భుతమైన అవకాశం దక్కింది. ఇలాంటి పాత్ర చేయడం ప్రతి నటికీ ఓ కల. నా కెరీర్లో తొలిసారిగా ఇలాంటి సంక్లిష్టమైన పాత్రను పోషించగలననే నమ్మకం కలిగింది. మహిళలను కేవలం గ్లామర్ కోసమే అన్నట్లుగా ఒకే తరహా పాత్రల్లో బంధించి చూపించడం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకే ఈ ‘నదియా’ పాత్రను వెంటనే ఎంచుకున్నా” అని కియారా స్పష్టం చేశారు.
యశ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో భారీ తారాగణం కొలువై ఉంది. లేడీ సూపర్‌స్టార్ నయనతార, బాలీవుడ్ భామలు హుమా ఖురేషీ, తారా సుతారియా, కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనిపై కియారా స్పందిస్తూ.. “ఇంతమంది అద్భుతమైన మహిళలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం సరికొత్త అనుభూతినిచ్చింది. ప్రతి ఒక్కరూ తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇంతమంది పవర్ఫుల్ మహిళలు ఒకే సినిమాలో కనిపించడం ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా కోసం సెట్లో ప్రతి ఒక్కరూ తమ పరిమితులను దాటి ఎంతో కష్టపడ్డారు. ఇలాంటి క్షణాలే సినిమాపై నాకు మరింత ఇష్టాన్ని పెంచుతాయి” అని ఆమె వివరించారు.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంతో, డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతున్న ఈ ‘టాక్సిక్’ చిత్రానికి యశ్, గీతూ మోహన్ దాస్ సంయుక్తంగా కథను అందించారు. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ తదితర భాషల్లో ప్రతిష్టాత్మకంగా విడుదల చేయనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు 26న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Aug 01, 2026 10:10 AM IST














