Aishwarya Rajesh: ఓ..! సుకుమారి మూవీ రివ్యూ.. పల్లెటూరి రొమాంటిక్ కామెడీ డ్రామా ఎలా ఉందంటే.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఓ సుకుమారి’. భార్యను తాకితే కరెంట్ షాక్ కొడుతుందనే ఒక వినూత్నమైన, ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా..

News18
News18

‘మసూద’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్, విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఓ సుకుమారి’. భార్యను తాకితే కరెంట్ షాక్ కొడుతుందనే ఒక వినూత్నమైన, ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వర రెడ్డి నిర్మించిన ఈ చిత్రం జూలై 17, 2026న భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి అడుగుపెట్టింది. మరి ఈ ఎలక్ట్రిఫైయింగ్ రొమాంటిక్ కామెడీ ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో నరాల యాదగిరి (తిరువీర్) కి ఎలాగైనా తన సొంత ఊరికి సర్పంచ్ కావాలనేది అతిపెద్ద కల. దానికి తోడు వాళ్ల తాత రాసిన ఓ విచిత్రమైన వీలునామా అతనికి మరో సవాల్ విసురుతుంది. ఆ వీలునామా ప్రకారం, యాదగిరికి లేదా అతని బాబాయ్ కొడుక్కి.. ఈ ఇద్దరిలో ఎవరికి ముందు మగబిడ్డ పుడితే వాళ్లకే 80 కోట్ల రూపాయల భారీ ఆస్తి దక్కుతుంది. ఈ ఆస్తిని దక్కించుకోవడం కోసం తాపత్రయపడుతున్న సమయంలోనే దామిని (ఐశ్వర్య రాజేష్)ని పెళ్లిచూపుల్లో చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు యాదగిరి.

అయితే దామినికి ఒక వింత శారీరక సమస్య ఉంటుంది. ఆమెను ఎవరు తాకినా భారీ కరెంట్ షాక్ కొడుతుంది. ఆమెను భరించలేక, ఈ విషయం బయటపడకుండా ఊరి జనాలు సైతం నిజాన్ని దాచిపెట్టి ఎలాగోలా యాదగిరితో పెళ్లి జరిపిస్తారు. అసలు ట్విస్ట్ శోభనం గదిలో ఉంటుంది. దామినిని తాకగానే యాదగిరికి కరెంట్ షాక్ కొట్టడంతో అసలు నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఆస్తి కోసం యాదగిరి పడ్డ పాట్లు ఏమిటి? సర్పంచ్ కల ఏమైంది? పిల్లలు కనడం అనే అసాధ్యమైన టార్గెట్ ను, కరెంట్ షాక్ సమస్యను వారు ఎలా అధిగమించారు? అనేదే మిగతా కథ.

విశ్లేషణ:

తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి భిన్నమైన పాయింట్ టచ్ చేయలేదు. “భార్యను తాకితే షాక్ కొట్టడం” అనే పాయింట్ వినగానే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరుగుతుంది. కథ స్లోగా మొదలైనా సినిమా ఫస్టాఫ్ చాలా వినోదాత్మకంగా సాగుతుంది. దామిని సమస్యను దాచిపెట్టడానికి ఊరి జనాలు పడే పాట్లు, పెళ్లి తంతు, హీరో హీరోయిన్ల మధ్య ఫీల్ గుడ్ ఎమోషనల్ ట్రాక్ కథను ఎంగేజింగ్‌గా మారుస్తాయి. కానీ, సెకాండాఫ్ కి వచ్చేసరికి కథనం కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. సర్పంచ్ ఎన్నికల డ్రామా, రొటీన్ ఫ్యామిలీ పాలిటిక్స్ వల్ల సినిమా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఐశ్వర్య రాజేష్ తెలంగాణ యాసలో మాట్లాడుతూ పదే పదే ‘ఉచ్చు’ అనే పదాన్ని వాడటం వినే కొద్దీ కాస్త విసుగు తెప్పిస్తుంది. దర్శకుడు భరత్ దర్శన్ రాసుకున్న కాన్సెప్ట్ అద్భుతంగా ఉన్నప్పటికీ, దానిని ఒక పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో ప్రెజెంట్ చేయడంలో కొంత తడబడ్డారు. బలమైన భావోద్వేగాలు లేకపోయినా క్లైమాక్స్ బాగానే ఉంది. నేరేషన్ సూపర్ కానీ, కొన్ని లాజిక్స్‌ మాత్రం మిస్ అయ్యారనే చెప్పుకోవాలి.

నటీనటులు, సాంకేతిక వర్గం:

ఈ సినిమాకు ప్రధాన బలం నటీనటుల ప్రతిభ. కరెంట్ షాక్ ఇచ్చే వింత వ్యాధితో బాధపడే యువతిగా ఐశ్వర్య రాజేష్ మరోసారి తన సహజమైన నటనతో కట్టిపడేసింది. ముఖ్యంగా గుడిలో వచ్చే ఒక యాక్షన్ సీక్వెన్స్‌లో ఆమె పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. పల్లెటూరి అమాయక యువకుడిగా, ఆస్తి కోసం ఆశపడే సగటు మనిషిగా తిరువీర్ నటన సూపర్బ్. శోభనం గదిలో ఆమెను తాకినప్పుడు షాక్ కొట్టి అతను ఎగిరిపడే దృశ్యాలు థియేటర్‌లో నవ్వుల వర్షం కురిపిస్తాయి. ఆమని, ఆనంద్, విష్ణు ఓయ్ తమ పాత్రల పరిధి మేర అద్భుతంగా నటించారు.

సాంకేతికంగా భరత్ మంచిరాజు అందించిన సంగీతం, పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. సిహెచ్ కుషేందర్ సినిమాటోగ్రఫీ పల్లెటూరి వాతావరణాన్ని అందంగా చూపించింది. ఎడిటర్ శ్రీ వరప్రసాద్ కత్తెర పదునైనదే. గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

ఫైనల్ గా చెప్పలంటే.. ఫ్యామిలీతో కలిసి సరదాగా చూడదగ్గ సినిమా.

రేటింగ్: 3

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports