Artificial Intelligence: ఏఐకి దాహం ఎక్కువ.. 2030 నాటికి 130 కోట్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం! | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

ఏఐ మౌలిక సదుపాయాల (AI Infrastructure) విస్తరణ వల్ల భూమిపై ఉన్న వనరుల పైన ప్రతికూల ప్రభావం ఉండనుందని పేర్కొంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Artificial Intelligence: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత అన్ని రంగాలను శరవేగంగా మార్చేస్తోంది. అయితే, ఈ అద్భుత సాంకేతికత వెనుక మానవాళి ఊహించని పర్యావరణ ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం (United Nations University) తన తాజా నివేదికలో సంచలన హెచ్చరికలు చేసింది. ఏఐ మౌలిక సదుపాయాల (AI Infrastructure) విస్తరణ వల్ల భూమిపై ఉన్న వనరుల పైన ప్రతికూల ప్రభావం ఉండనుందని పేర్కొంది. ముఖ్యంగా నీరు, విద్యుత్ విషయంలో 2030 నాటికి తీవ్ర సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందన్నారు.

ఈ నివేదికలోని అత్యంత దిగ్భ్రాంతికరమైన అంశం ఏమిటంటే.. ఈ దశాబ్దం ముగిసే సమయానికి (2030 నాటికి), కేవలం ఏఐ సంబంధిత డేటా సెంటర్లు (Data Centres) ఉపయోగించే నీటి పరిమాణం.. దాదాపు 130 కోట్ల మంది ప్రజల ప్రాథమిక గృహావసరాలకు సరిపోయేంతగా ఉంటుంది. అంటే ప్రస్తుత మొత్తం ఆఫ్రికా ఖండ జనాభా తాగే నీటిని ఈ డేటా సెంటర్లు మింగేయనున్నాయి.

డేటా సెంటర్ల వృద్ధికి ఇప్పుడు ఏఐ ప్రధాన కారణమైంది. 2025లో మొత్తం డేటా సెంటర్ల విద్యుత్ వినియోగంలో ఏఐ వాటా దాదాపు 20 శాతంగా ఉంది. ఒకవేళ 2030 నాటికి అంచనా వేసినట్లుగా ఈ వాటా 40 శాతానికి చేరితే.. దీని విద్యుత్ డిమాండ్ ఏకంగా 378 టెరావాట్ అవర్లకు (TWh) చేరుకుంటుంది. ఈ విద్యుత్ సబ్-సహారన్ ఆఫ్రికాలోని మొత్తం జనాభా యొక్క 2 సంవత్సరాల గృహ విద్యుత్ అవసరాలకు సమానం.

పరిశోధకుల ప్రకారం.. ఇప్పటివరకు ఏఐ పర్యావరణ ప్రభావంపై జరిగిన చర్చలన్నీ కేవలం కార్బన్ ఉద్గారాల (Carbon Emissions) చుట్టూనే సాగాయి. కానీ అది మింగేస్తున్న నీటి వినియోగంపై ఎవరూ దృష్టి పెట్టలేదు. డేటా సెంటర్లలోని సర్వర్లను చల్లబరచడానికి (Cooling) భారీ మొత్తంలో నీరు అవసరమవుతుంది. అంతేకాకుండా, ఏఐ సిస్టమ్స్ నడవడానికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియల ద్వారా కూడా పరోక్షంగా టన్నుల కొద్దీ నీరు వృథా అవుతోంది.

కరెంటు వినియోగంలో రికార్డులు.. మూడు దేశాల వాటాతో సమానం!

ఈ నివేదిక ప్రకారం విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరగనుంది. 2030 నాటికి డేటా సెంటర్ల విద్యుత్ డిమాండ్ రెట్టింపై 945 టెరావాట్ అవర్లకు (TWh) చేరుకుంటుంది. ఈ పరిమాణం పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు నైజీరియా (ఈ మూడు దేశాల మొత్తం జనాభా 65 కోట్లకు పైమాటే) దేశాలు సంయుక్తంగా ఏడాది పొడవునా ఉపయోగించే విద్యుత్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

ఏఐ పర్యావరణ ప్రభావం కేవలం సాఫ్ట్‌వేర్‌కే పరిమితం కాలేదు. డేటా సెంటర్లు, ప్రత్యేక చిప్‌లు, కూలింగ్ పరికరాలు, వాటికి మద్దతు ఇచ్చే ఎనర్జీ నెట్‌వర్క్‌ల వంటి భారీ భౌతిక వ్యవస్థ అంతా ప్రకృతి వనరులను విపరీతంగా హరిస్తోంది.

రోజువారీ వాడకంతోనే ఎక్కువ నష్టం

మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఏఐ సాధారణ, రోజువారీ వాడకం వల్లే 80 నుంచి 90 శాతం విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. మనం సాధారణంగా అడిగే టెక్స్ట్ ఆధారిత ప్రశ్నల (Text Queries) కంటే.. ఏఐ ద్వారా ఇమేజ్ (చిత్రాలు) మరియు వీడియోలను జనరేట్ చేయడానికి గణనీయంగా ఎక్కువ విద్యుత్ అవసరమవుతుందని పరిశోధకులు అంచనా వేశారు.

అయితే, ఈ నివేదిక ఉద్దేశం ఏఐ అభివృద్ధిని నిరుత్సాహపరచడం కాదు. సాంకేతిక దిగ్గజాలు మరియు విధాన నిర్ణేతలు పర్యావరణానికి హాని కలగని పద్ధతులను (Sustainable Practices) అవలంబించాలని, భవిష్యత్తు ఆవిష్కరణల వ్యూహాలలో పర్యావరణ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఐరాస నివేదిక గట్టిగా పిలుపునిచ్చింది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *