E20 పెట్రోల్‌పై కేంద్రం స్పష్టత.. పాత, కొత్త వాహనాలకు ఎలాంటి నష్టం లేదన్న ప్రభుత్వం | | ACTPnews

News18


Last Updated:

E20 పెట్రోల్ వల్ల వాహనాలకు నష్టం లేదని కేంద్రం స్పష్టం చేసింది. పరిశోధనల తర్వాతే అమలు చేశామని, లక్ష్యాన్ని ఐదేళ్ల ముందే సాధించామని తెలిపింది.

News18
News18

దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న 20 శాతం ఎథనాల్ మిశ్రమం కలిగిన E20 పెట్రోల్ వల్ల పాత వాహనాలకు కానీ, కొత్త వాహనాలకు కానీ ఎలాంటి నష్టం జరగలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పష్టం చేసింది. ఈ ఇంధనం కారణంగా ఇంజిన్ దెబ్బతినడం, వాహనాలు మధ్యలో నిలిచిపోవడం లేదా విడిభాగాలు త్వరగా పాడవడం వంటి ఫిర్యాదులు ఇప్పటివరకు తమకు అందలేదని తెలిపింది. అలాగే E20 వల్ల పాత వాహనాలు దెబ్బతిన్నట్లు కూడా ఎలాంటి సమాచారం లేదని వెల్లడించింది.

సోమవారం రాజ్యసభలో ఎంపీ జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పెట్రోలియం, సహజ వాయు శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ ఈ వివరాలు వెల్లడించారు. ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్యక్రమాన్ని ఎలాంటి ముందస్తు పరిశోధన లేకుండా అమలు చేయలేదని, నీతి ఆయోగ్, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (IIP) వంటి సాంకేతిక సంస్థలతో కలిసి ఎన్నో సంవత్సరాలపాటు శాస్త్రీయ పరిశోధనలు, పరీక్షలు నిర్వహించిన తర్వాతే దీనిని అమల్లోకి తీసుకొచ్చామని తెలిపారు.

పాత వాహనాలకూ సురక్షితం

పరీక్షల్లో E20 ఇంధనాన్ని ఉపయోగించిన పాత వాహనాల పనితీరులో ఎలాంటి గణనీయమైన తగ్గుదల కనిపించలేదని మంత్రి వివరించారు. ఎథనాల్ మిశ్రమం కారణంగా పెద్ద ఎత్తున ఇంజిన్లు దెబ్బతింటున్నాయనే విషయాన్ని నిరూపించే ఆధారాలు ఏ అధ్యయనంలోనూ లభించలేదని చెప్పారు.

లక్ష్యాన్ని ఐదేళ్ల ముందే సాధించిన భారత్

దీర్ఘకాలిక ప్రణాళికల ఫలితంగా భారత్ 20 శాతం ఎథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని నిర్దేశించిన గడువుకు ఐదేళ్ల ముందే చేరుకుందని సురేశ్ గోపీ వెల్లడించారు. దీని ద్వారా రూ.1.97 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందని తెలిపారు. అలాగే 316 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు వినియోగానికి ప్రత్యామ్నాయం లభించిందని, 962 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు తగ్గాయని పేర్కొన్నారు. అంతేకాకుండా చెరకు, మొక్కజొన్న రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరిందని వివరించారు.

రాష్ట్రాల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు

దేశంలో E15+ పెట్రోల్ మూడున్నరేళ్లకు పైగా, E19-E20 ఇంధనం రెండున్నరేళ్లుగా వినియోగంలో ఉందని ప్రభుత్వం తెలిపింది. ఈ కాలంలో 20 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 3 కోట్లకు పైగా కార్లు ఈ ఇంధనాన్ని ఉపయోగించినప్పటికీ, E20 వల్ల ఇంజిన్ దెబ్బతిన్నట్లు ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు లభించలేదని పేర్కొంది. అలాగే ఏ రాష్ట్రం నుంచీ కూడా ఇలాంటి ఫిర్యాదులు అందలేదని స్పష్టం చేసింది.

నీటి కల్తీపై ఆందోళనలను కొట్టిపారేసిన కేంద్రం

ఎథనాల్ మిశ్రమ పెట్రోల్‌లో నీరు కలిసే ప్రమాదం ఉందన్న ప్రచారాన్ని కూడా కేంద్రం పూర్తిగా ఖండించింది. ఈ విషయంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని తెలిపింది. పెట్రోల్ బంకుల్లో విక్రయించే ఇంధనం భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా ఉంటుందని పేర్కొంది.

ఇంధన నాణ్యతను నిర్ధారించేందుకు, కల్తీని అరికట్టేందుకు వినియోగదారుల ఫిర్యాదుల నేపథ్యంలో గత 10 నుంచి 20 రోజుల్లో దేశవ్యాప్తంగా 30 వేలకుపైగా నాణ్యత తనిఖీలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అలాగే ఇంధన కల్తీ విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినట్లు తెలిపింది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports