Electoral Bonds Case Congress taunts BJP Over Electoral Bonds Data Missing

Electoral Bonds Case: ఎలక్టోరల్ బాండ్స్ కేసు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే SBIపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. అడిగిన విధంగా సరైన వివరాలు ఇవ్వడం లేదని మండి పడుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. ఎలక్టోరల్ బాండ్స్ పేరు చెప్పి బీజేపీ అవకతవకలకు పాల్పడిందని,అది ఎక్కడ బయటపడుతుందోనని భయపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. డొల్ల కంపెనీలను రక్షించేందుకు ఇలా పెద్ద ఎత్తున విరాళాలు తీసుకుందని ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు. యునిక్ బాండ్ ఐడీ నంబర్స్‌ అందరికీ తెలిసేలా వెల్లడించాలని, అప్పుడే నిజానిజాలేంటో బయటపడతాయని డిమాండ్ చేశారు. కావాలనే SBI ఈ విషయంలో జాప్యం చేస్తోందని, ఎన్నికల వరకూ ఇలాగే సాగదీయాలని చూస్తోందని విమర్శించారు. 2019 నుంచి బీజేపీకి రూ.6 వేల కోట్ల మేర విరాళాల రూపంలో వచ్చాయని వెల్లడించారు. దాదాపు 1,300  సంస్థలు, వ్యక్తులకు SBI ఎలక్టోరల్ బాండ్స్‌ విక్రయించిందని తేల్చి చెప్పారు. ఇప్పటికే విడుదలైన వివరాల ఆధారంగా చూస్తే బీజేపీ కచ్చితంగా ఏదో మోసానికి పాల్పడినట్టు అర్థమవుతోందని ఫైర్ అయ్యారు జైరాం రమేశ్. 

“బీజేపీ ఎలక్టోరల్ బాండ్స్‌ పేరు చెప్పి క్విడ్ ప్రో కో కి పాల్పడింది. కొన్ని కంపెనీలు బీజేపీకి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చాయి. అలా ఇచ్చిన వెంటనే ఆ సంస్థలకు భారీ లాభాలు వచ్చాయి. ఇదే అనుమానంగా ఉంది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో రూ.800 కోట్లు ఇచ్చింది. 2023 ఏప్రిల్‌లో రూ.140 కోట్లు విరాళమిచ్చింది. ఆ తరవాత నెల రోజులకే థానే బోరివల్ ట్విన్ టన్నెల్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌ని ఆ కంపెనీకి కట్టబెట్టారు. రూ.14,400 కోట్ల విలువైన ప్రాజెక్ట్ ఇది”

– జైరాం రమేశ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ 

ఆ వివరాలు ఎక్కడికి పోయాయి: కాంగ్రెస్ 

2022 అక్టోబర్ 7వ తేదీన జిందాల్ స్టీల్ కంపెనీ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో రూ.25 కోట్ల విరాళమిచ్చిందని, ఆ తరవాత మూడు రోజులకే ఓ కోల్‌మైన్‌ని కట్టబెట్టారని ఆరోపించారు. అంతే కాదు. గతేడాది కేంద్ర ప్రభుత్వం కావాలనే ఈడీ, సీబీఐ దాడులు చేయించి, బెదిరించి విరాళాలు రాబట్టుకుందని విమర్శించారు. విరాళాలు ఇచ్చిన కంపెనీలకు భారీ లాభాలు వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు చేశారు. పైగా ఓ కంపెనీ ఇంత మాత్రమే విరాళంగా ఇవ్వాలన్న నిబంధననూ కావాలనే తొలగించారని మండి పడ్డారు. అసలు కీలకమైన డేటా కనిపించకుండాపోవడమే అన్నింటికన్నా ఎక్కువ అనుమానాలకు తావిస్తోందని కాంగ్రెస్ అంటోంది. దాదాపు రూ.2,500 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్‌ వివరాలు కనిపించకుండా పోయాయని చెబుతోంది. 2018 మార్చి నుంచి 2019 ఏప్రిల్ మధ్య కాలంలోని బాండ్ల వివరాలు మిస్ అవ్వడంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ కేసుపై సుప్రీంకోర్టు కాస్త గట్టిగానే దృష్టి పెట్టింది. 

Also Read: Russian Presidential Elections: కేరళలో రష్యా అధ్యక్ష ఎన్నికల హడావుడి, పోలింగ్‌కి ఏర్పాట్లు కూడా చేశారు

మరిన్ని చూడండి

Source link