Last Updated:
Hyderabad: ఆన్లైన్ డేటింగ్ యాప్‌ల ముసుగులో జరుగుతున్న మోసాలు రోజురోజుకూ సరికొత్త పంథాను సంతరించుకుంటున్నాయి.
తాజాగా నగరంలో హైటెక్ మోసగాళ్ల వలలో పడి ఒక యువ న్యాయవాది ఏకంగా రూ.4.91 కోట్లు పోగొట్టుకున్న సంచలన ఉదంతం వెలుగుచూసింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వెల్లడించిన పూర్తి వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్ అయిన హైటెక్‌సిటీ పరిధిలోని ఓ ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలో నివాసముంటున్న 27 ఏళ్ల యువ న్యాయవాదికి గత ఏడాది ఆగస్టు నెలలో ఓ పాపులర్ డేటింగ్ యాప్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఎదుటి వ్యక్తి తన పేరు దిశ అని, ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నానంటూ నమ్మబలికింది. కొద్దిరోజుల పాటు ఇద్దరి మధ్య నిరంతరం చాటింగ్ సాగింది. మాటలు కలిపి మంచి స్నేహితురాలిగా నటిస్తూ అతడి నమ్మకాన్ని చూరగొంది.
ఆ తర్వాత తన అసలు ఎత్తుగడను ప్రారంభించింది. ఒకరోజు తన తండ్రి అకస్మాత్తుగా మరణించాడని, అత్యవసర ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం కావాలని బాధితుడిని వేడుకుంది. ఆమె పరిస్థితిని చూసి జాలిపడిన ఆ న్యాయవాది ఏకంగా రూ.4.38 లక్షల మొత్తాన్ని ఆమె సూచించిన ఖాతాకు బదిలీ చేశారు. అయితే ఆ తర్వాత కూడా నిందితురాలు వరుసగా మరింత డబ్బు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. అనుమానం వచ్చిన బాధితుడు డబ్బు ఇచ్చేందుకు తీవ్రంగా నిరాకరించారు.
డబ్బు ఇవ్వకపోవడంతో మోసగాళ్లు తమ అసలు రంగును బయటపెట్టారు. తాను మహిళను కాదని, ‘అలీనా’ అనే ట్రాన్స్‌జెండర్‌నని బాధితుడికి చెప్పింది. అడిగినంత నగదు ఇవ్వకపోతే డేటింగ్ యాప్‌లో జరిగిన వ్యక్తిగత సమాచారాన్ని, చాటింగ్‌ను బయటపెట్టి పరువు తీస్తానని తీవ్రంగా హెచ్చరించింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున ట్రాన్స్జెండర్ల బృందాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు నిరసన తెలిపి నవ్వులపాలు చేస్తామని బెదిరించింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితుడు ఆ నంబర్‌ను బ్లాక్ చేశారు. అయితే ఇతర నంబర్ల నుంచి కాల్స్ రావడంతో వాటిని కూడా బ్లాక్ చేసుకుంటూ వచ్చారు.
గత జులై నెలలో నిందితులు మరో కొత్త నంబర్ ద్వారా మళ్లీ రంగప్రవేశం చేశారు. తన తల్లి మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతోందని, ఒకవేళ సమయానికి డబ్బు ఇవ్వకపోతే ఆమె ప్రాణాలు పోతాయని, ఆ మరణానికి బాధితుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురిచేశారు. ఆ బెదిరింపులకు భయపడిన సదరు యువకుడు దఫదఫాలుగా వారు చెప్పిన వ్యక్తులకు, సూచించిన ఖాతాలకు నిరంతరం నగదు పంపడం ప్రారంభించారు.
గత ఏడాది ఆగస్టు 2వ తేదీ నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఏకంగా 241 విడతల్లో మొత్తం రూ.4,91,00,000 (సుమారు రూ. 5 కోట్లు) సమర్పించుకున్నారు. ఈ క్రమంలో బాధితుడు తన సొంత పొదుపు మొత్తంతో పాటు కుటుంబసభ్యుల బ్యాంక్ ఖాతాల్లోని డిపాజిట్లను ఖాళీ చేశారు. అంతటితో ఆగక తమకున్న ఒక ఖరీదైన ఫ్లాట్‌ను సైతం తక్కువ ధరకు అమ్మి ఆ సొమ్మును చెల్లించాల్సి వచ్చింది.
ఎంత డబ్బు ఇచ్చినా నిందితుల వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ రోజురోజుకూ మరింత తీవ్రతరం కావడంతో బాధితుడు చివరకు మానసిక కుంగుబాటుకు గురై సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. బాధితుడి నుంచి బదిలీ అయిన మొత్తం రూ.4.91 కోట్లు కూడా ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి చెందిన ఒకే ఒక్క వ్యక్తికి సంబంధించిన రెండు ప్రధాన బ్యాంక్ ఖాతాల్లోకే చేరినట్లు గుర్తించారు.
ఇది ఒక్కరి పని మాత్రమే కాదని, దీని వెనుక పక్కా ప్రణాళికతో డేటింగ్ యాప్‌ల ద్వారా సంపన్నులను ట్రాప్ చేసే ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు తీవ్రంగా అనుమానిస్తున్నారు. సదరు బ్యాంక్ ఖాతాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్‌లు, ఆన్లైన్ పరిచయాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, బెదిరింపులకు భయపడి డబ్బు చెల్లించకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.














