Hyderabad: హైదరాబాద్‌ జలమండలిలో భారీ అవినీతి తిమింగలం.. రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు.. లాకర్లలో ఇంకెంతుందో! | తెలంగాణ వార్తలు | ACTPnews

ఏసీబీ దాడుల్లో దొరికిన నగదు, బంగారం


Last Updated:

కుమార్‌తో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో జరిపిన తనిఖీల్లో కళ్ళు చెదిరేలా అక్రమ ఆస్తుల సామ్రాజ్యం వెలుగుచూసింది.

ఏసీబీ దాడుల్లో దొరికిన నగదు, బంగారం
ఏసీబీ దాడుల్లో దొరికిన నగదు, బంగారం

Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ జలమండలి (HMWSSB) జనరల్ మేనేజర్ (జీఎం) అనంత్ లక్ష్మీ కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం అధికారికంగా అరెస్ట్ చేశారు. మంగళవారం ప్రారంభమైన ఈ ఏసీబీ సోదాలు రాత్రి వరకు నిర్విరామంగా కొనసాగాయి. కుమార్‌తో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో జరిపిన తనిఖీల్లో కళ్ళు చెదిరేలా అక్రమ ఆస్తుల సామ్రాజ్యం వెలుగుచూసింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆస్తుల విలువ కొన్ని కోట్లలో చూపిస్తున్నప్పటికీ, వాటి బహిరంగ మార్కెట్ విలువ దాదాపు రూ. 100 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఇంట్లో కుప్పలుగా నోట్ల కట్టలు – కౌంటింగ్ మెషీన్ల రంగప్రవేశం

ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో మల్లాపూర్‌లోని జీఎం కుమార్ ప్రధాన నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులకు అక్కడ లభించిన నగదు చూసి నోరెళ్లబెట్టారు. ఇంట్లోని బెడ్‌రూమ్‌లు, అల్మారాల్లో ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున కరెన్సీ నోట్ల కట్టలు కుప్పలుగా దర్శనమిచ్చాయి. చేత్తో లెక్కించడం సాధ్యం కాకపోవడంతో అధికారులు ప్రత్యేకంగా కౌంటింగ్ మెషీన్లను రప్పించి నగదును లెక్కించారు. ఈ తనిఖీల్లో రూ. 1.10 కోట్ల నగదు పట్టుబడగా, వీటితో పాటు 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బినామీల పేర్లతో భారీగా భూములు, ఫ్లాట్లు:

జలమండలిలో కీలక పదవిలో ఉన్న కుమార్, తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతి సొమ్మును స్థిరాస్తుల్లో పెట్టుబడిగా పెట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. నిజామాబాద్ జిల్లాలో 3 ఎకరాల విలువైన వ్యవసాయ భూమిని కలిగి ఉన్నట్లు గుర్తించారు. అలాగే హైదరాబాద్ నగరంలోని ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో మూడు విలాసవంతమైన ఫ్లాట్లతో పాటు, నగర పరిసర ప్రాంతాల్లో మరో 6 ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు కుమార్ నివాసం నుంచి 2 లగ్జరీ కార్లు, ఒక బైక్‌ను సీజ్ చేశారు. కేవలం రిజిస్ట్రేషన్ విలువల ప్రకారమే ఈ ఆస్తుల విలువ రూ. 5.88 కోట్లుగా ఉండగా, ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం వీటి విలువ రూ. 100 కోట్ల మార్కును దాటుతుందని అధికారులు వెల్లడించారు.

కుమార్తె పెళ్లికి వందల కోట్ల ఖర్చు, లగ్జరీ లైఫ్

గత నెలలోనే కుమార్ తన కుమార్తె వివాహాన్ని అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా జరిపించినట్లు సమాచారం. ఈ వివాహ వేడుక కోసమే కొన్ని వందల కోట్ల రూపాయలు నీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారనే వార్తలు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఒక ప్రభుత్వ అధికారి స్థాయికి మించి జరిగిన ఈ వివాహ ఖర్చులపై నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతోనే ఏసీబీ పక్కా స్కెచ్‌తో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ భారీ పెళ్లి ఖర్చులకు సంబంధించిన నిధులను ఎక్కడి నుంచి సమకూర్చారనే దానిపై కూడా అధికారులు కుమార్ నుంచి వివరాలు రాబడుతున్నారు.

ముందుంది బ్యాంకు లాకర్ల వేట

ప్రస్తుతం కుమార్ నివాసాల్లో లభించిన ఆస్తులు కాకుండా, వివిధ బ్యాంకుల్లో ఆయన పేరిట, బినామీల పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసేందుకు ఏసీబీ అధికారులు సర్వసన్నద్ధమవుతున్నారు. ఈ లాకర్లలో మరికొంత భారీ మొత్తంలో బంగారం, నగదు, బినామీ ఆస్తుల పత్రాలు ఉండే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థ భావిస్తోంది. కుమార్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు ఇంకా ముగియకపోవడంతో అక్రమ ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. నిందితుడు అనంత్ లక్ష్మీ కుమార్‌ను కోర్టులో హాజరుపరిచి, తదుపరి విచారణ నిమిత్తం ఏసీబీ కస్టడీకి కోరనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ అరెస్ట్ జలమండలితో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports