Miss YS Sharmila golden chance..!? వైఎస్ షర్మిల గోల్డెన్ ఛాన్స్ మిస్..!?

టైటిల్ చూడగానే అవునా.. నిజమా.. అనిపిస్తోంది కదూ..! అవునండోయ్ ఇది అక్షరాలా నిజమే.. ఇదంతా ఎవరో చెప్పింది కాదబ్బా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి గురించి స్వయానా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిందే. ఇంతకీ ఏమిటా గోల్డెన్ ఛాన్స్..? ఎన్నికల ముందే ఎందుకు గుర్తొచ్చింది..? ఇందులో నిజానిజాలెంత..? నెట్టింట్లో ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్ ఏంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి.

ఇదీ అసలు సంగతి!

ఏపీలో ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో పార్టీల అధిపతులు ఇంటర్వ్యూలు ఇచ్చే పనిలో బిజిబిజీగా గడుపుతున్నారు. ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే ఏపీకి విచ్చేసి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా వైసీపీ అధినేత జగన్ రెడ్డిలను ఇంటర్వ్యూ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోలు, చిన్నపాటి వీడియోలను రిలీజ్ చేయగా.. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. జగన్ రెడ్డి.. తన సోదరి షర్మిల గురించి ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు.  జగన్ మాటలను కాస్త గమనిస్తే.. ఎందుకో గోల్డెన్ ఛాన్స్ షర్మిల మిస్సయిందని స్పష్టంగా అర్థమవుతోంది. బహుశా రేపొద్దున్న ఇదే జరిగినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. చెల్లి షర్మిల చంద్రబాబును నమ్ముకుని ఎన్నికలకు వెళ్తోందని.. డిపాజిట్స్ కూడా రావని జోస్యం చెప్పేశారు జగన్. బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలూ చంద్రబాబుకు తొత్తులుగా మారాయని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా 2024 గెలిచిన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది కూడా క్లియర్ కట్‌గానే జగన్ చెప్పేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపికి ఎన్నికల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూమద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు.

డిపాజిట్లు రావు!

చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేసి చెల్లెలు షర్మిలను తనపై ఉసిగోల్పారని జగన్ చెబుతూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబును నమ్ముకుని వెళ్తున్న షర్మిలకు డిపాజిట్లు రావు.. ఈ విషయమే తనను ఎక్కువగా బాధిస్తోందన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబే నడిపిస్తున్నారన్నట్లుగా జగన్ కామెంట్స్ చేయడం గమనార్హం. దీనిపై వైసీపీ కార్యకర్తలు, నేతలు స్పందిస్తూ.. అన్నతో సఖ్యతగా ఉంటే 2026 లో రాజ్యసభ పదవి ఇంటికి నడుచుకుంటా వచ్చేదని.. కానీ షర్మిల ఆ గోల్డెన్ ఛాన్స్ మిస్సయిందని కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయాలలో హత్యలుండవ్.. ఆత్మహత్యలే ఉంటాయన్న విషయం త్వరలోనే షర్మిలకు తెలుస్తుందని మరికొందరు నేతలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. చంద్రబాబును నమ్ముకుని రాజకీయాలు చేస్తే అంతే సంగతులని.. ఇదంతా చరిత్ర చెబుతోందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇందుకు అంతే రీతిలోనే టీడీపీ, జనసేన, కాంగ్రెస్.. బీజేపీ కార్యకర్తలు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే చర్చ.. అంతకుమించి రచ్చ నడుస్తోంది.

Source link