రాజకీయాల్లో ఒక్కసారి నిలబడితే చాలు దశాబ్దాల పాటు నిలదొక్కుకున్నవాళ్లు ఉన్నారు. తరతరాలకు తమ రాజకీయ వారసత్వాన్ని పరిచయం చేసిన వాళ్లు కూడా ఇప్పటికి ఉన్నారు. ఎలాంటి రాజకీయ పదవులు లేకుండా జాతీయ స్థాయిలో, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు కూడా తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది లీడర్లు ఉన్నారు. తాజాగా కన్నుమూసిన కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం, కాపు సామాజికవర్గానికి మేలు చేసేందుకు చేపట్టిన పోరాటం చిరస్మరణీయమనే చెబుతారు రాజకీయ విశ్లేషకులు.
రాజకీయ పద్మవ్యూహంలో ఒంటరి పోరాటం చేసి అసువులు బాసిన కాపునేత ముద్రగడ పద్మనాభం ప్రొఫైల్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని నాటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. ముద్రగడ తండ్రి వీరరాఘవరావు స్వాతంత్ర సమరయోధుడు కావడంతో ఆయన ఎవరికి తలవంచని స్వభావం, నచ్చినదే చేసే అలవాటు పుట్టుకతోనే వచ్చిందంటారు. పద్మనాభం భార్య పద్మావతి, కొడుకు గిరిబాబు, కూతురు క్రాంతి ఉన్నారు. తండ్రి స్వాతంత్ర్య భావాలు, రాజకీయ పరిణితి కలిగిన వ్యక్తి కావడంతో పద్మనాభం 1962, 1967లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1978లో జనతా పార్టీ నుండి గెలిచి రాజకీయ అరంగేట్రం చేశారు. అటుపై మహానటుడు, దివంగత సీఎం సీనియర్ ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో జాయిన్ అయ్యారు ముద్రగడ పద్మనాభం. జనతా పార్టీ, కాంగ్రెస్ నుంచి ఒక్కొక్కసారి టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా 1999లో కాకినాడ ఎంపీగా కూడా విజయం సాధించారు. ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పని చేశారు.
ఏ వ్యక్తికి విజయం శాశ్వతంగా ఉండదు. మరీ ముఖ్యంగా ముక్కుసూటితనం, ఎవరికి తలవంచని స్వభావం కలిగిన వ్యక్తులకు అవమానాలు తప్పవని కాపునేత జీవితం ఓ ఉదాహరణగా నిలుస్తుంది. నాలుగు సార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రి, ఒకసారి ఎంపీగా పని చేసిన వ్యక్తి జీవితంలో లోబడకుండా బ్రతికే స్వభావమే అతని రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఉన్నతస్థాయిని చేర్చలేకపోయిందని అంటున్నారు తెలకపల్లి రవి.
1988లో సీనియర్ ఎన్టీఆర్‌తో విభేదాల కారణంగా మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన ముద్రగడ పద్మనాభం ఆ తర్వాత కాపు ఉద్యమనాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. కాపులకు రాజకీయంగా ఉన్నత పదవులు దక్కాలని, రిజర్వేషన్ కల్పించాలనే నినాదాన్ని ఎత్తుకొని విస్తృతంగా పోరాడిన వ్యక్తి జీవితంలో తుని రైలు దహనం కేసు ఓ మాయనిమచ్చగా మిగిలిపోయింది. తుని రైలు ఘటన తర్వాత తన ఇంట్లోనే ఆమరణ దీక్షకు దిగిన ముద్రగడ దీక్షను భగ్నం చేయడమే కాకుండా దీక్ష చేస్తున్న ముద్రగడ ఫ్యామిలీని దారుణంగా ఈడ్చుకెళ్లారు అప్పటి పోలీసులు. ఆ తర్వాత జరిగిన రాజకీయ మార్పులు, సామాజికవర్గ పరిణామాలు ఆయన్ని కాపు ఉద్యమాన్ని సక్సెస్ చేయడంలో విఫలమయ్యారని స్వయంగా తన సామాజికవర్గానికి చెందిన కాపులే విమర్శించడంతో 2020లో కాపు ఉద్యమానికి గుడ్ బై చెప్పారు.
ప్రశ్నించే లక్షణం, తనను నమ్ముకున్న సామాజికవర్గానికి మేలు చేయడం కోసం ఒంటరిగా నిలబడాలనే తత్వం ఉన్న ముద్రగడ పద్మనాభం పొలిటికల్ ఛర్మిష్మాను సినీ నటుడు పవన్ కల్యాణ్ పిఠాపురం విజయం తుడిచేశాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి గెలవడం, పవన్ కల్యాణ్ కూడా కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో ముద్రగడ ఇమేజ్‌ని పూర్తిగా డ్యామేజ్ చేసినట్లైందంటారు పొలిటికల్ ఎనలిస్టులు. అంతే కాదు ముద్రగడ పద్మనాభరెడ్డిగా ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం, కూతురు క్రాంతి జనసేనలోకి వెళ్లడం, తండ్రి ముద్రగడ రాజకీయాలను మీడియా ముందే ఏకిపారేయడంతో ఆయన్ని మరింత కించపరిచాయనే అంటున్నారు.
ఆ తర్వాత 2025లో ముద్రగడకు క్యాన్సర్ వచ్చిందటూ వార్తలతో మరింత సతమతం అయ్యారు. అంతే కాదు ముద్రగడను ఆయన కొడుకు ఇంట్లోనే బంధించాడని పుకార్లు కూడా రావడంతో ఆయన కాస్త కుంగిపోయారు. తన కొడుకు కెరియర్ పై కుట్ర పన్నారంటూ నాడు ముద్రగడ పద్మనాభం బహిరంగలేఖ కూడా రాశారు. చివరకు కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ తో హైదరాబాద్ లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు కాపునేత.
అయితే ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితం గురించి సీనియర్ పొలిటికల్ ఎనలిస్ట్ తెలకపల్లి రవి తన అభిప్రాయాన్ని న్యూస్18తో పంచుకున్నారు. ముద్రగడ పద్మనాభం సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగి గెలిచిన నాయకుడని..ఆయన ప్రజలు తిరస్కరించిన నేత కాదని రాజకీయ పార్టీలు వెలివేసిన నేతగా అభివర్ణించారు. అందుకే ఆయనకు ప్రజల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. ప్రభుత్వాలు మారినా పార్టీలు మారినప్పటికి ఆయనపై వ్యక్తిగత విమర్శలు తక్కువ అన్నారు. కాపు సమాజం కోసం దీక్షలు,ఉద్యమాలు చేసి పోరాడిన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. కాపు రిజర్వేషన్ కోసం పోరాటంలో కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు. పార్టీలకు అతీతంగా ముద్రగడ పద్మనాభాన్ని విస్మరించలేని పరిస్థితి తీసుకొచ్చారని .. చివరి దశలో పోటీ, పరిణామాలు పట్టు విడుపు లేని వైఖరి వల్లే ఒంటరిగా మిగిలారు తప్ప ఆయన సంపాదించుకున్న గౌరవాన్ని, కాపుల కోసం పోషించిన పాత్రను ఎవరూ కాదనలేనిదన్నారు. పదవుల కోసం పాకులాడకపోవడం కూడా ఆయనలో ఓ లక్షణమని .. మిగిలిన నేతల్లా కండువాలు మార్చడం కాదు ఎవరికి లోబడకుండా జీవించాలనే స్వభావం..ఎవరికి తలవంచని మనస్తత్వం వల్లే రాజకీయ జీవితంలోనే కాదు వ్యక్తిగత, కుటుంబం పరంగా ఒకింత ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని చెప్పారు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. అందుకే ముద్రగడ పద్మనాభం సంస్మరణసభ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా తాజాగా తమ నివాళులు అర్పించారు. కాపుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.













