Last Updated:
Murder: ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్ జిల్లాలో ఆస్తి వ్యామోహం ఓ కుమారుడిని కిరాతకుడిగా మార్చింది. రూ.150 కోట్ల విలువైన ఆస్తిని తన పేరిట రాయడం లేదనే కోపంతో, మద్యమత్తులో కన్నతండ్రిని పిస్టల్‌తో కాల్చి చంపిన ఘోర సంఘటన మోదీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.
పోలీస్ ఎస్పీ భాస్కర్‌వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మోదీనగర్ పరిధిలోని బుధానా గ్రామానికి చెందిన హరి ఓం చౌదరి (52) ఆ ప్రాంతంలో ఒక సంపన్న రైతు. ఆయనకు గ్రామంలో 47 ఎకరాల సాగుభూమితో పాటు, దిల్లీ-మేరఠ్ జాతీయ రహదారి మార్గంలో ఒక భారీ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది. మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ దాదాపు రూ.150 కోట్లు ఉంటుంది. హరి ఓం చౌదరికి భార్య అనిత, పెద్ద కుమారుడు నిఖిల్ (32), చిన్న కుమారుడు నిశాంత్ ఉన్నారు.
పెద్ద కుమారుడు నిఖిల్ ఎలాంటి పనీ చేయకుండా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తండ్రి హరి ఓం ఇప్పటికే నిఖిల్ పేరిట షాపింగ్ కాంప్లెక్స్‌లోని కొన్ని దుకాణాలను, 15 ఎకరాల సాగుభూమిని రాసిచ్చారు. అయినప్పటికీ విలాసాలకు అలవాటు పడిన నిఖిల్.. మిగిలిన ఆస్తి మొత్తాన్ని కూడా తక్షణమే తన పేరు మీదే బదిలీ చేయాలంటూ తండ్రిపై నిరంతరం ఒత్తిడి తెచ్చేవాడు. బాధ్యతలేకుండా తిరుగుతున్న కొడుకుకు ఆస్తి రాయడానికి తండ్రి నిరాకరిస్తూ, అతని ప్రవర్తనను తరచూ మందలించేవారు.
బుధవారం రాత్రి నిఖిల్ పూర్తిగా మద్యమత్తులో ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో తండ్రి హరి ఓం అతడిని నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య ఆస్తి విషయమై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన నిఖిల్, తన వద్ద ఉన్న పిస్టల్ తీసి కన్నతండ్రిపై అత్యంత దారుణంగా కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలైన హరి ఓం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మోదీనగర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














