Mann Ki Baat : ఈ ఏడాది మన్ కీ బాత్ మొదటి ఎపిసోడ్ లో ప్రధాని మోదీ కీలక విషయాలు చర్చించారు. జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతోపాటు ఓటర్లకు సాధికారత కల్పించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నందుకు ఎన్నికల కమిషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. రాజ్యాంగ నిర్మాతలు ఎన్నికల సంఘానికి సముచితమైన స్థానాన్ని, ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యానికి సమానమైన స్థానాన్ని కల్పించారని అన్నారు.
“1951-52లో దేశంలో మొదటి సారి ఎన్నికలు జరిగినప్పుడు, దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందా అని కొంతమందికి అనుమానం కలిగింది. కానీ మన ప్రజాస్వామ్యం అన్ని భయాందోళనలను పూర్తిగా చెరిపేసింది. ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లి వంటిది” అని ఆయన అన్నారు. గడచిన దశాబ్ద కాలంలో దేశ ప్రజాస్వామ్యం బలపడి, ఎంతో అభివృద్ధి చెందిందని ప్రధాని వెల్లడించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) సమగ్రతపై ప్రతిపక్ష పార్టీల విమర్శలు, ప్రశ్నల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత గణతంత్ర 75వ వార్షికోత్సవం
ఈ ఏడాది రాబోతున్న గణతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఎందుకంటే ఈ ఏడాదితో రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా మన పవిత్రమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన రాజ్యాంగ పరిషత్‌లోని గొప్ప వ్యక్తులందరికీ నేను నమస్కరిస్తున్నానన్నారు. రాజ్యాంగ పరిషత్‌లోని ముగ్గురు సభ్యులు చైర్మెన్ రాజేంద్ర ప్రసాద్, బీఆర్ అంబేద్కర్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీలను విలువలను హైలెట్ చేస్తూ వారికి సంబంధించిన కొన్ని చిన్న ఆడియో క్లిప్ లను ప్లే చేశారు. వారి ఆలోచనలతో ప్రేరణ పొంది రాజ్యాంగ నిర్మాతలు గర్వించదగిన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మహా కుంభమేళా గురించి
ప్రయాగ్ రాజ్ లో జరుగుతోన్న మహా కుంభమేళా 2025పైనా మోదీ చర్చించారు. ఈ వేడుక నాగరికత మూలాలను బలోపేతం చేస్తోందని, బంగారు భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ రావడం ప్రతీ భారతీయుడికి గర్వకారణమని.. వివిధ కులాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా భక్తులు తరలివస్తున్నారని అన్నారు. ఇక్కడ ఎలాంటి వివక్ష లేదని చెప్పారు. దాంతో పాటు అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లాకు ప్రతిష్ఠాపన జరిగిన మొదటి వార్షికోత్సవంపై స్పందిస్తూ.. వారసత్వాన్ని కాపాడుకోవాలని, స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
అంతరిక్ష రంగంపై
2025 ప్రారంభంలోనే అంతరిక్ష రంగంలో భారత్ ఎన్నో చారిత్రాత్మక విజయాలను సాధించిందని మోదీ అన్నారు. PIXXEL ప్రైవేట్ ఉపగ్రహం ఒక పెద్ద అచీవ్‌మెంట్ అని, స్పేస్ డాకింగ్ విజయవంతం అయినందుకు ఇస్రోను అభినందించారు. స్పేస్ డాకింగ్ చేసిన ప్రపంచంలోనే నాలుగో దేశంగా భారత్ అవతరించిందని కొనియాడారు.
ఈ సారి వారం ముందుగానే మన్ కీ బాత్..
సాధారణంగా మన్ కీ బాత్ ను ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహిస్తారు. కానీ ఈ నెలలో వచ్చే ఆదివారం(చివరి) జనవరి 26 గణతంత్ర దినోత్సవం వస్తుంది. కాబట్టి జనవరి 19 అంటే ఈ రోజే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది ఈ సంవత్సరం జరిగిన మొదటి ఎపిసోడ్.. ఈ రేడియో కార్యక్రమంలో 118వ ఎపిసోడ్ ను సూచిస్తుంది.
Also Read : VinFast VF7 First Look : భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో VF7, VF6.. ఆకట్టుకునే ఫీచర్లతో, 10 సంవత్సరాల బ్యాటరీ వారంటీతో డెబ్యూ ఇచ్చిన VinFast
మరిన్ని చూడండి