Last Updated:
అంతరిక్ష పరిశోధనల తదుపరి దశలో భారత్‌తో కలిసి ప్రయాణించాలని ఫ్రాన్స్ సహా ఇతర దేశాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. గురువారం పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో ఆయన ఇస్రో సేవలను, విజయాలను కొనియాడారు.
అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌తో కలిసి నడవాలని ఫ్రాన్స్ సహా ప్రపంచ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గురువారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన తొలి అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సుకు ఆహ్వానించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శతాబ్దాలుగా అంతరిక్షం మానవుల ఊహలను రేకెత్తిస్తోందని, ఇప్పుడు వాతావరణం, వ్యవసాయం, సముద్రాలు, ప్రజల జీవన విధానాన్ని శాసిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. అంతరిక్ష ప్రయోగాల వల్ల అనంతమైన ప్రయోజనాలు ఉన్నాయని, అదే సమయంలో మనందరిపైనా ఉమ్మడి బాధ్యత ఉందన్నారు.














