PM Modi: పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ? ఎస్‌సీఓ సదస్సుకు పిలిచే యోచనలో దాయాది దేశం! | | ACTPnews

ప్రధాని మోదీ


Last Updated:

ఇస్లామాబాద్ వేదికగా 2027లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు పాకిస్థాన్ సంకేతాలిచ్చింది. ఎస్‌సీఓ నిబంధనల ప్రకారం సభ్య దేశాలన్నింటికీ ఆహ్వానాలు పంపుతామని పాక్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

ప్రధాని మోదీ
ప్రధాని మోదీ

ఉగ్రవాదానికి మద్దతు పలుకుతూ భారత్‌తో ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వే దాయాది దేశం పాకిస్థాన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 2027లో ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి అధికారికంగా ఆహ్వానం పంపనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒక మీడియా సమావేశంలో ఈ కీలక ప్రకటన చేసినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. ఎస్‌సీఓ నిబంధనావళి, ప్రోటోకాల్ ప్రకారం సభ్య దేశాల అధినేతలందరికీ విధిగా ఆహ్వానాలు పంపడం ఆతిథ్య దేశం బాధ్యత అని ఆయన గుర్తుచేశారు.

ఈ క్రమంలోనే ఎస్‌సీఓలో కీలక సభ్య దేశమైన భారత్‌కు సైతం పిలుపునిస్తామని స్పష్టం చేశారు. రొటేషన్ పద్ధతిలో భాగంగా 2027లో పాక్ ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, ఇరాన్, బెలారస్ సహా పది దేశాలు ఎస్‌సీఓలో భాగస్వాములుగా ఉన్నాయి. ఆసియా ప్రాంతంలో శాంతి, భద్రతలతో పాటు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో 2001లో ఈ సంస్థ ఏర్పాటైంది.

చైనా వేదికగా 2025 సదస్సు

అంతకుముందు 2025లో ఎస్‌సీఓ సదస్సు చైనాలోని టియాంజిన్ నగరంలో విజయవంతంగా జరిగింది. ఆ సదస్సులో ప్రధాని మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్, బెలారస్ తదితర దేశాల అధినేతలు పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన గ్లోబల్ ట్రేడ్ వార్ నేపథ్యంలో జరిగిన ఆ సదస్సు.. భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఆసియాలో అతిపెద్ద ఆర్థిక శక్తులైన భారత్, చైనా, రష్యాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఎస్‌సీఓ సదస్సు అత్యంత ప్రభావవంతమైన దౌత్య వేదికగా నిలిచింది.

ఉద్రిక్తతల నడుమ ఆహ్వానం

ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితుల్లో ఈ ఆహ్వానం ప్రాధాన్యత సంతరించుకుంది. 2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ (బైసరన్ వ్యాలీ)లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 25 మంది పర్యాటకులతో సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన తర్వాత దౌత్యపరంగా పాక్‌ను ఏకాకిని చేస్తూ భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు పాక్ అధికారులను దేశం నుంచి బహిష్కరించింది.

ఆపరేషన్ సింధూర్‌తో దెబ్బకు దెబ్బ

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ తరహా దాడులు చేసింది. మే 7వ తేదీన పాక్ పంజాబ్ ప్రావిన్స్‌తో పాటు ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ప్రాంతంలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత బలగాలు నేలమట్టం చేశాయి. ఈ భారీ ఆపరేషన్‌లో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత ఇరు దేశాల సరిహద్దుల్లో భారీగా కాల్పులు జరగడం, రెండు వైపులా ప్రాణనష్టం సంభవించడం తెలిసిందే. ఇలాంటి తీవ్ర పరిణామాల తర్వాత పాక్ తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports