Last Updated:
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం వల్ల భవిష్యత్తులో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల మనుగడకు ఎలాంటి ముప్పు పొంచి ఉందో వివరించారు.
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో నిత్యం జరిగే పరిణామాలపై తనదైన లాజిక్స్ తో స్పందించే ఆర్జీవీ.. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం వల్ల భవిష్యత్తులో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల మనుగడకు ఎలాంటి ముప్పు పొంచి ఉందో సుదీర్ఘంగా వివరించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పాలనా వ్యవస్థలో ప్రక్షాళన జరగాలంటే అది కేవలం ఏఐ సాంకేతికతతోనే సాధ్యమవుతుందని వర్మ కుండబద్దలు కొట్టారు.
ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ పనులను అధికారులు నిర్వహిస్తుంటే, వారిని రాజకీయ నాయకులు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవస్థ కేవలం అధికారుల ‘నిజాయితీ’, ‘నిర్భయం’ అనే రెండు మానవ భావోద్వేగాల మీద ఆధారపడి నడుస్తోందని ఆర్జీవీ విశ్లేషించారు. ఒక ప్రభుత్వ అధికారి కూడా సగటు మనిషేనని, అతనిపై బదిలీ అవుతుందనే భయం, పిల్లల చదువులు, ఫీజుల టెన్షన్, సొంత ఇల్లు కొనుక్కోవాలనే కోరికలు ఉంటాయని గుర్తుచేశారు. వీటికి తోడు, ఒక్క ఫోన్ కాల్‌తో కెరీర్‌ను నాశనం చేయగల రాజకీయ నాయకుల ఒత్తిడి వారిపై నిరంతరం ఉంటుంది. ఇలాంటి భయాలు, ప్రలోభాల వల్లే వ్యవస్థలో నిబంధనలు పక్కదారి పడుతున్నాయని, లంచం ఇస్తే తప్ప ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు ముందుకు కదలని దుస్థితి నెలకొందని వర్మ విమర్శించారు.
మనిషి స్థానంలో ‘ఏఐ’ (AI) ని ప్రవేశపెడితే పరిస్థితి పూర్తిగా మారుతుందని వర్మ స్పష్టం చేశారు. కంప్యూటర్ అల్గారిథమ్‌కు ఎవరూ లంచం ఇవ్వలేరని, బదిలీ చేస్తామని భయపెట్టలేరని లాజిక్ తీశారు. ఏఐకి కుటుంబం, పెన్షన్ల టెన్షన్ ఉండదు కాబట్టి, అర్ధరాత్రి ఫోన్ చేసి తమ బంధువులకు కాంట్రాక్ట్ ఇవ్వమని ఏ మంత్రీ దానిపై ఒత్తిడి తేలేరన్నారు. దీనికి ఉదాహరణగా దుబాయ్ లోని ‘స్మార్ట్ పోలీస్ స్టేషన్ల’ను ఆర్జీవీ ప్రస్తావించారు. అక్కడ మనుషుల ప్రమేయం లేకుండానే యంత్రాల ద్వారా ఎఫ్ఐఆర్లు ఆటోమేటిక్‌గా, అవినీతికి తావులేకుండా నమోదు అవుతున్నాయని, ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కాదని, కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవమని ఆయన ఉద్ఘాటించారు.
పరిపాలన వ్యవస్థ పూర్తిగా ఆటోమేటెడ్ మరియు అవినీతి రహితంగా మారిన తర్వాత ఇక రాజకీయ నాయకుల అవసరం ఏముంటుందని వర్మ సూటిగా ప్రశ్నించారు. ఉదాహరణకు, ఒక ప్రాంతంలో పత్తి పంటకు నష్టం వాటిల్లిందని, ఒక నిర్దిష్ట కంపెనీ పురుగుమందును కొనుగోలు చేయాలని ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో కోరితే.. దాని వెనుక తన బంధువుల ఫ్యాక్టరీకి లాభం చేకూర్చే కుట్ర దాగి ఉండొచ్చన్నారు. విపక్షాలు ఆరోపణలు చేసినా, నిజం ఏమిటన్నది ఓటర్లకు ఎప్పటికీ తెలియదన్నారు. కానీ అదే స్థానంలో ఏఐ ఉంటే, శాటిలైట్ ఫొటోలు, నేల స్వభావం, వర్షపాతం, గ్లోబల్ మార్కెట్ ధరలు, పదేళ్ల రిపోర్టులు వంటి శాస్త్రీయ డేటాను క్షణాల్లో విశ్లేషించి, పక్కా ఆధారాలతో ఏది సరైన పరిష్కారమో తేల్చి చెబుతుందని వివరించారు. ఏఐకి బంధుప్రీతి, ఎన్నికల్లో ఓడిపోతామనే భయం, దురాశ ఉండవని స్పష్టం చేశారు.
ప్రజా ప్రతినిధులు ఇప్పటివరకు ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య వారధులుగా చలామణి అవుతున్నారు. కానీ ఏఐ రాకతో వ్యవస్థ పారదర్శకంగా, అవినీతి రహితంగా మారితే ఈ రాజకీయ మధ్యవర్తుల అవసరమే లేకుండా పోతుందని వర్మ తేల్చి చెప్పారు. ఈ మార్పును నాయకులు జవాబుదారీతనం పేరుతో వ్యతిరేకించవచ్చు కానీ, వారి అసలు భయం తమ స్వార్థానికి ప్రభుత్వ పదవులను వాడుకోలేమనేదేనని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వాలను ఎవరూ కూల్చాల్సిన పనిలేదని, పాలన మొత్తం అల్గారిథమ్‌ల చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయమన్నారు. మనుషులతో పోలిస్తే, ఏఐ చూడటానికి మనిషి కాకపోయినా, అది ప్రజలకు ఖచ్చితంగా ఎంతో మేలు చేస్తుందని ఆర్జీవీ తన పోస్ట్ ను ముగించారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














