Last Updated:
Team India: మైదానంలో సిక్సర్లు, ఫోర్లు కొడుతూ రికార్డులు సృష్టించే క్రికెటర్లను ప్రపంచమంతా ఆరాధిస్తుంది. కానీ వారి వెనుక ఉంటూ వారి శారీరక శ్రమను తుడిచివేసి, మ్యాచ్‌కు సిద్ధం చేసే తెరవెనుక హీరోల కథలు చాలా అరుదుగా వెలుగులోకి వస్తాయి.
అలాంటి అత్యంత స్ఫూర్తిదాయకమైన కథనమే భారత క్రికెట్ జట్టు మసాజ్ థెరపిస్ట్ రాజీవ్ కుమార్ జీవితం. నెలకు కేవలం రూ. 100 జీతంతో ఢిల్లీ వీధుల్లో జీవితాన్ని ప్రారంభించిన రాజీవ్, ఈరోజు టీమిండియా స్టార్ ప్లేయర్లకు నమ్మకమైన మసాజర్గా ఎదిగిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
2002లో రాజీవ్ కుమార్ మెరుగైన భవిష్యత్తు కోసం ఢిల్లీలో అడుగుపెట్టినప్పుడు అతని లక్ష్యం చాలా చిన్నది. ఏ రోజూ కడుపు ఆకలితో అలమటించకుండా కుటుంబానికి ఆసరాగా నిలిస్తే చాలనుకున్నాడు. జోధ్‌పూర్ యూనివర్సిటీ నుంచి మసాజ్ థెరపీలో డిప్లొమా చేసినప్పటికీ, ప్రారంభంలో అతనికి నెలకు కేవలం రూ. 100 జీతంతో ఉద్యోగం దొరికింది. బస్సులు ఎక్కుతూ, కిలోమీటర్ల కొద్దీ కాలిబాటన నడుస్తూ తీవ్రంగా శ్రమించాడు. కనీసం సొంతంగా మొబైల్ కొనే స్తోమత లేకపోవడంతో ఎవరో దయతలచి నోకియా 1100 ఫోన్ కొనిచ్చారు. దాదాపు ఐదేళ్ల పాటు సరైన ఉద్యోగం లేకపోయినా అతడు ఎప్పుడూ అధైర్యపడలేదు.
రాజీవ్ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా అతని జీవితంలోకి ఒక దేవదూతలా వచ్చాడు భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా. నెహ్రా గాయపడి కోలుకుంటున్న సమయంలో, రాజీవ్ తన మసాజ్ థెరపీతో అతనికి అండగా నిలిచాడు. నెహ్రాకు ఎండలో మసాజ్ చేయించుకోవడం ఇష్టం కావడంతో, మిలమిల మెరిసే ఎండలో గంటల తరబడి ఇంటి పైకప్పు మీదే అతనికి చికిత్స అందించేవాడు. రాజీవ్ పనిలోని నిబద్ధత, అతడి చేతుల్లోని మ్యాజిక్ నెహ్రాను ఆకట్టుకున్నాయి. తన కెరీర్ డోర్లు తెరిచింది ఆశిష్ నెహ్రానేనని రాజీవ్ ఎంతో కృతజ్ఞతతో గుర్తుచేసుకుంటాడు.
గత ఎనిమిదేళ్లలో నలుగురు భారత కెప్టెన్లతో రాజీవ్ కలసి పనిచేశాడు. జట్టులోకి కొత్తగా వచ్చినప్పుడు ఎంఎస్ ధోనీ అతనికి కొండంత ధైర్యాన్ని ఇచ్చాడట. “రాజీవ్ భాయ్ ఎలాంటి టెన్షన్ పడొద్దు, ప్రశాంతంగా పని చేసుకో. ఎప్పుడైనా నా గది తలుపులు నీకోసం తెరిచే ఉంటాయి” అని ధోనీ చెప్పడమే కాకుండా స్వయంగా డిన్నర్‌కు కూడా తీసుకెళ్లాడు.
ఇక మహ్మద్ సిరాజ్, షమీలతో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఎప్పుడూ రాజీవ్ కోసం ఎదురుచూసేవారని, కుల్దీప్ అయితే అందరికంటే ఎక్కువగా మసాజ్ చేయించుకునేవాడని, అతనికి ఏకంగా ఒక ‘అవార్డు’ ఇవ్వొచ్చని రాజీవ్ సరదాగా వ్యాఖ్యానించాడు. కరోనా కష్టకాలంలో మొత్తం జట్టు తనకు అండగా నిలిచి ఆర్థిక సాయం చేసిందని చెబుతూ రాజీవ్ భావోద్వేగానికి గురయ్యాడు.
రాజీవ్ సాధించిన విజయం కేవలం తనకే పరిమితం కాలేదు. అతడిని ఆదర్శంగా తీసుకుని సొంత ఊరి నుంచి ఏకంగా 50 మంది యువతీ యువకులు మసాజ్ థెరపీ వృత్తిలోకి అడుగుపెట్టారు. వారిలో కొందరు ఐపీఎల్ జట్లతో, కొందరు రంజీ జట్లతో, ఇంకొందరు టీమిండియాతో కలిసి పనిచేస్తున్నారు. మరికొందరు యోగా, ఆయుర్వేద రంగాల్లో స్థిరపడ్డారు. సొంత ఊరికి వెళ్లినప్పుడు అక్కడి జనాలు చూపే అభిమానమే తనకు దొరికిన అతిపెద్ద పతకమని రాజీవ్ గర్వంగా చెబుతున్నాడు. చేతివృత్తినే నమ్ముకుని, నిజాయితీతో కష్టపడితే ఏ స్థాయికైనా ఎదగవచ్చనడానికి రాజీవ్ కుమార్ జీవితమే ఒక నిదర్శనం.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana














