Last Updated:
లేటెస్ట్ ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ డ్రామా ‘తెల్ల కాగితం’ (Thellakaagitham). యంగ్ యాక్టర్ హర్ష్ రోషన్, కొత్త హీరోయిన్ నక్షత్ర జంటగా రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
టాలీవుడ్లో ఈమధ్య కాలంలో యూత్‌ఫుల్, టీనేజ్ లవ్ స్టోరీలకు విశేష ఆదరణ లభిస్తోంది. ‘బేబీ’, ‘మ్యాడ్’ లాంటి చిత్రాలు యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదే కోవలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లేటెస్ట్ ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ డ్రామా ‘తెల్ల కాగితం’ (Thellakaagitham). యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్ష్ రోషన్, కొత్త హీరోయిన్ నక్షత్ర జంటగా రూపొందిన ఈ చిత్రానికి రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మాలపాటి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు యూత్ నుంచి అద్భుతమైన స్పందన రాగా, తాజాగా మేకర్స్ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది.
పక్కా టీనేజ్, స్కూల్ లవ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఎంతో సహజంగా మలిచారు. తెలిసీ తెలియని పసి వయసులో పుట్టే స్వచ్ఛమైన ప్రేమ.. ఆ వయసులో ఉండే ఆవేశం, తొందరపాటులో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వారి జీవితాల్లో ఎలాంటి తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకుంటాయనే సున్నితమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా ట్రైలర్లో వచ్చే “ఒక్క చిన్న తప్పు.. తెల్లటి కాగితం లాంటి మీ జీవితాన్ని నాశనం చేస్తుంది” అనే పవర్ ఫుల్ డైలాగ్ సినిమాలోని అసలు నిజాన్ని, కథలోని భావోద్వేగ తీవ్రతను అద్భుతంగా ఆవిష్కరిస్తోంది. నేటి యువతకు, విద్యార్థులకు ఈ చిత్రం ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో టాలెంటెడ్ నటులు అజయ్, దీపక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ సంగీతం. సెన్సేషనల్ హిట్ ‘బేబీ’ సినిమాతో తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసిన విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఆయన అందించిన మెలోడీ పాటలు, హృదయాన్ని హత్తుకునే నేపథ్య సంగీతం ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. స్కూల్ లైఫ్ జ్ఞాపకాలను, యూత్‌ఫుల్ ఎమోషన్స్‌ను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న ‘తెల్ల కాగితం’ చిత్రం గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. స్వచ్ఛమైన టీనేజ్ లవ్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను ఏ స్థాయిలో మెప్పిస్తుందో వేచి చూడాలి.














