Last Updated:
గరుడ సేవకు ప్రత్యేక తెల్లపట్టు గొడుగులు తిరుమలకు చేరుకున్నాయి. చెన్నై నుంచి 9 గొడుగులను టీటీడీకి అందజేశారు.
తిరుమలలో గరుడ సేవకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ వాహన సేవకు ఉపయోగించే ప్రత్యేక తెల్లపట్టు గొడుగులు తిరుమలకు చేరుకున్నాయి. చెన్నై నుంచి ఐదు రోజుల పాటు సాగిన ప్రత్యేక ఊరేగింపు అనంతరం 9 గొడుగులను శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చి టీటీడీ అధికారులకు అందజేశారు.
హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ ట్రస్టీ ఆర్.ఆర్. గోపాల్ జీ నేతృత్వంలో ఈ గొడుగులను చెన్నై నుంచి తిరుమలకు తీసుకొచ్చారు. చెన్నైలోని చెన్న కేశవ పెరుమాళ్ ఆలయం నుంచి ఈ నెల 13న ప్రారంభమైన గొడుగుల ఊరేగింపు పలు ప్రాంతాల మీదుగా కొనసాగి తిరుమలకు చేరుకుంది. తిరుమలకు చేరుకున్న అనంతరం వైభవ ఉత్సవ మండపం నుంచి మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీవారి ఆలయానికి చేర్చారు.
మొత్తం 11 తెల్లపట్టు గొడుగులను ఈసారి తీసుకొచ్చినట్లు ట్రస్టీ ఆర్.ఆర్. గోపాల్ జీ తెలిపారు. ఇందులో రెండు గొడుగులను ఇప్పటికే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అందజేయగా.. మిగిలిన 9 గొడుగులను ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయానికి సమర్పించారు. గరుడ వాహన సేవలో స్వామివారి అలంకరణకు ఈ ప్రత్యేక గొడుగులను వినియోగించనున్నారు.
చెన్నై నుంచి తిరుమల వరకు సాగిన ఐదు రోజుల ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని గోపాల్ జీ తెలిపారు. మార్గమధ్యంలో గొడుగులను దర్శించుకున్న భక్తులు వాటి వద్ద తమ కోరికలను ప్రార్థించారని చెప్పారు. భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలతో సాగిన ఈ ఊరేగింపు అనంతరం గొడుగులు తిరుమలకు చేరుకోవడం విశేషంగా మారింది. కాగా, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవ రేపు రాత్రి జరగనుంది. ఈ సేవను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గరుడ సేవలో అలంకరించనున్న తెల్లపట్టు గొడుగులను ఆలయానికి చేర్చే కార్యక్రమం కూడా భక్తుల్లో ఆసక్తిని కలిగించింది.
గొడుగుల ఊరేగింపు సజావుగా సాగేందుకు సహకరించిన తమిళనాడు పోలీసు శాఖతో పాటు టీటీడీ అధికారులకు ఆర్.ఆర్. గోపాల్ జీ కృతజ్ఞతలు తెలిపారు. చెన్నై నుంచి భక్తుల భాగస్వామ్యంతో వచ్చిన ఈ ప్రత్యేక గొడుగులు ఇప్పుడు శ్రీవారి గరుడ సేవలో కొలువుదీరనున్నాయి.













