Tirumala: తిరుమలలో ఒక్కసారిగా హై అలర్ట్.. రంగంలోకి దిగిన ఆక్టోపస్ కమాండోలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

News18


Last Updated:

ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఆక్టోపస్ (OCTOPUS), రాష్ట్ర పోలీసు శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాయి.

+

News18

ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఆక్టోపస్ (OCTOPUS), రాష్ట్ర పోలీసు శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదుల దాడులు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు తలెత్తిన సమయంలో భద్రతా బలగాలు ఎలా స్పందిస్తాయి, భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు.

తిరుమలలోని పీఏసీ–4 (Pilgrim Amenities Complex) సత్రంలో నిర్వహించిన ఈ మాక్ డ్రిల్‌లో ఆక్టోపస్ కమాండోలు, పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. సామాన్య భక్తులు బస చేసే సత్రాన్ని ఉగ్రవాదులు ముట్టడించినట్లుగా ఊహించి, భద్రతా బలగాలు చేపట్టాల్సిన చర్యలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ఒక్క సమాచారం అందిన వెంటనే భద్రతా సిబ్బంది ఎంత వేగంగా స్పందిస్తారు, భవనాన్ని ఎలా చుట్టుముట్టి ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంటారు, భక్తులను ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు వంటి అంశాలను ప్రాక్టికల్‌గా చూపించారు.

మాక్ డ్రిల్ ప్రారంభానికి ముందు టీటీడీ విజిలెన్స్ అధికారులు మైక్ ద్వారా భక్తులకు ఇది కేవలం శిక్షణ కార్యక్రమమేనని ప్రకటించి, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. అనంతరం ఆక్టోపస్ కమాండోలు పూర్తి ఆయుధాలతో భవనంలోకి ప్రవేశించి, ఒక్కో అంతస్తును క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉగ్రవాదుల కోసం జల్లెడ పట్టినట్లుగా ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో భక్తులు ఎలా ప్రవర్తించాలి, భద్రతా సిబ్బంది సూచనలను ఎలా పాటించాలి, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు. ఎలాంటి విపత్తు సంభవించినా భయాందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని, భద్రతా బలగాలకు సహకరించాలని సూచించారు.

అధికారులు మాట్లాడుతూ తిరుమలకు ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు వస్తుంటారని, వారి భద్రతే తమ మొదటి ప్రాధాన్యమని తెలిపారు. అందుకే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి 15 రోజులకు ఒకసారి ఆక్టోపస్, పోలీసు శాఖ, టీటీడీ విజిలెన్స్ సంయుక్తంగా ఇలాంటి మాక్ డ్రిల్‌లు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా భద్రతా సిబ్బంది అప్రమత్తతను మరింత పెంచడంతో పాటు, భక్తుల్లో కూడా అత్యవసర పరిస్థితులపై అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తుల రక్షణ కోసం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భద్రతా వ్యవస్థ పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ఈ మాక్ డ్రిల్‌ను వీక్షించిన భక్తులు కూడా భద్రతా బలగాల పనితీరును అభినందించారు. తిరుమల వంటి అత్యంత రద్దీ ప్రదేశాల్లో ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల భక్తుల్లో భద్రతపై మరింత నమ్మకం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports