నీట్ పేపర్ లీక్ వివాదం, దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీకి ఆయన రాజీనామా లేఖ పంపగా.. కొన్ని గంట్లోనే రాజీనామాకు ఆమోదం తెలిపారు. దేశ యువత భవిష్యత్తు, ఆకాంక్షలను గౌరవిస్తూ, ఈ ఆందోళనలు దేశవిద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించారు.అలాగే ప్రస్తుతం ఉన్న శాఖలతో పాటు విద్యాశాఖ బాధ్యతలను కూడా కేంద్ర కేబినెట్ మంత్రి ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతగా అప్పగించాలని రాష్ట్రపతి ఆదేశించారు.
నీట్ పేపర్ లీకేజీపై జంతర్ మంతర్ వద్ద సుదీర్ఘ పోరాటం చేసిన కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు, విద్యాశాఖ మంత్రి రాజీనామాను విద్యార్థుల పోరాట విజయంగా అభివర్ణించారు. పరీక్షల సంస్కరణలు, బాధితులకు పరిహారంపై కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో నిరసనలు ఫలిచ్చాయని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ప్రకటన విడుదల చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ విద్యావ్యవస్థ పునర్నిర్మాణానికి ఒక కీలక అడుగు అని, నిరసనలు తెలిపిన విద్యార్థుల ధైర్యానికి ఇది పెద్ద విజయమని రాహుల్ గాంధీ కొనియాడారు. వీధుల్లోకి వచ్చి భవిష్యత్తు కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతూ, అణచివేతపై పోరాడితే మార్పు సాధ్యమవుతుందని ఈ నిర్ణయం నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం మిగిలిన డిమాండ్లను నెరవేరుస్తూ విద్యార్థులపై దాడి చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనలకు ప్రధాని మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.
నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి నిరసనగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుండి ఇందిరా గాంధీ విగ్రహం వరకు జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్మగ్లింగ్ ముఠాల మూలాలను మట్టుబెట్టేందుకు డ్రోన్లు, ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రకృత్తి సంపదను దోచుకునే స్మగ్లర్ల పట్ల సహించేది లేదని స్పష్టం చేశారు.
యూరోప్‌లో తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల వ్యాపించిన కార్చిచ్చు తీవ్రరూపం దాల్చడంతో స్పెయిన్ దేశ చరిత్రలోనే తొలిసారిగా నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. మ్యాడ్రిడ్ పరిసర ప్రాంతాల నుండి 10,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫ్రాన్స్ తీరప్రాంతంలో 40,000 మందిని ఖాళీ చేయించి, మంటలను అదుపు చేయడానికి ఐరోపా యూనియన్ (EU) సహాయాన్ని కోరింది.
ఇరాన్‌పై మునుపెన్నడూ లేని రీతిలో అతిపెద్ద సైనిక దాడి చేయడంపై తాను ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ప్రస్తుతం చర్చలకు సీరియస్‌గా వస్తోందని, సంభాషణలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఒప్పందానికి రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూనే, దౌత్య మార్గాలకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు.
తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’ తొలిరోజు రూ.42.70 కోట్ల నెట్ వసూళ్లతో అదరగొట్టింది. అయితే రెండవ రోజు కలెక్షన్లు 50 శాతం పడిపోయి రూ.21.15 కోట్ల నెట్ రాబట్టింది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.112.50 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం, మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వీకెండ్లో భారీ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
సూర్య, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ సినిమా నుండి ‘ద వెడ్డింగ్ సాంగ్’ లిరికల్ వీడియో విడుదల చేశారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ వేడుక పాటను స్వయంగా హీరో సూర్య ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.













