తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరికొత్త విద్యా విధానం ప్రారంభానికి సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో నిర్మించిన తొలి పాఠశాల భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. నిరుపేద విద్యార్థులకు ఈ స్కూల్ ఎంతగానో ఉపయోగపడనుంది.
2. నేనున్నా.. అభిమానికి పవన్ భరోసా
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న 17 ఏళ్ల అభిమాని నిరంజన్ కోరిక తీర్చడానికి ఆయన హనుమకొండ వెళ్లారు. నిరంజన్‌ను పరామర్శించి, ధైర్యం చెప్పి, ఆ కుటుంబానికి పూర్తి భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను చూడాలనే కల నెరవేరడంతో ఆ కుటుంబ సభ్యులు ఎమోషనల్ అయ్యారు.
3. వైసీపీ తీరుపై నారా లోకేశ్ తీవ్ర విమర్శలు
ఏపీ హోంమంత్రి అనితపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఆ పార్టీ విషపూరిత రాజకీయ సంస్కృతినీ, మహిళా ద్వేషాన్నీ బయటపెట్టిందని మండిపడ్డారు. అనిత ధైర్యవంతురాలనీ, ప్రజాసేవకు నిదర్శనమని ఆయన కొనియాడారు. ఈ ఘటనపై రాష్ట్రంలోని దళితులకు, మహిళలకు వైసీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
4. సీఎం రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు
రాష్ట్రంలో పేదల ఇళ్లను కూలుస్తూ సీఎం రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. హిట్లర్ తనకు స్ఫూర్తి అనడమే ముఖ్యమంత్రి నిజస్వరూపానికి నిదర్శనమని సెటైర్ వేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది తమ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. ఓటరు జాబితా ప్రక్షాళనపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
5. పవన్‌పై కవిత ఫైర్
ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వారానికి మూడు రోజులు హైదరాబాద్‌లోనే రాజకీయాలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బలహీనత వల్లే పక్క రాష్ట్ర నాయకులు ఇక్కడ రాజ్యమేలుతున్నారని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మనమే పాలించుకుందామని పిలుపునిచ్చారు. రామగుండం పర్యటనలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
6. టెలిగ్రామ్ నిషేధంపై రాహుల్ గాంధీ ఫైర్
నీట్ పునఃపరీక్ష సందర్భంగా టెలిగ్రామ్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఈ చర్య దొంగను వదిలేసి బాధితుడి ఇంటికి తాళం వేసినట్లు ఉందని సెటైర్ చేశారు. లక్షల మంది విద్యార్థులు చదువు కోసం ఉపయోగించే యాప్‌ను బ్యాన్ చేయడం సరికాదన్నారు. రేపు నిందితులు వాట్సాప్‌లో పేపర్లు లీక్ చేస్తే దాన్ని కూడా నిషేధిస్తారా అని ప్రశ్నించారు.
7. ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు
ఇరాన్‌తో కుదుర్చుకోబోయేది కేవలం అవగాహనా ఒప్పందం మాత్రమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ ఆ దేశ తీరు మారకపోతే మళ్లీ బాంబులు వేస్తామని హెచ్చరించారు. ఫ్రాన్స్‌లో జరురుతున్న జీ7 సదస్సు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో ఒప్పందంపై సంతకాలు జరగనున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
8. అమెరికా ఆస్పత్రిలో కాల్పుల కలకలం
అమెరికాలోని డెలావేర్ రాష్ట్రం విల్మింగ్టన్ నగరంలో ఉన్న ఒక ఆస్పత్రిలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తుపాకీ గాయాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అక్కడ ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు.
9. కుమారుడి సినిమాకు ధనుష్ దర్శకత్వం
ప్రముఖ నటుడు ధనుష్ త్వరలోనే తన పెద్ద కుమారుడు యాత్రను హీరోగా పరిచయం చేయనున్నారు. ఈ మాస్ కమర్షియల్ చిత్రానికి ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించనున్నట్లు కోలీవుడ్ సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్ షూట్ ప్రారంభం కానుంది. రాయన్ సినిమా సెట్స్‌లో యాత్ర కెమెరా ఆపరేట్ చేస్తూ కనిపించిన సంగతి తెలిసిందే.
10. వెంకీ, అనిల్ రావిపూడి కొత్త సినిమా టైటిల్
వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి ఒక భారీ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జనవరి 13 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. కీర్తి సురేశ్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.












