Last Updated:
టీటీడీ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు. భక్తులు అధికారిక వెబ్‌సైట్, విక్రయ కేంద్రాలను పరిశీలించాలి.
భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని టీటీడీ ఉత్పత్తుల పేరుతో ఆన్‌లైన్‌లో అధిక ధరలకు పలు వస్తువులు అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేస్తున్న అగరబత్తులను కొన్ని ఈ-కామర్స్ వేదికల్లో అసలు ధర కంటే రెండింతలకు పైగా ఎక్కువ చేసి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు పలువురు నకిలీ టీటీడీ ప్రాడెక్ట్స్ ని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో భక్తులు కొనుగోలు చేసే ముందు అధికారిక ధరలు, అసలు వస్తువుని తప్పనిసరిగా పరిశీలించాలని సూచనలు వినిపిస్తున్నాయి.
శ్రీవారి ఆలయాల్లో స్వామివారి అలంకరణకు వినియోగించిన పవిత్ర పుష్పాలను ప్రత్యేక ప్రక్రియ ద్వారా సుగంధభరిత అగరబత్తులుగా తయారు చేయించడం టీటీడీ ప్రత్యేకత. వివిధ పరిమాణాల్లో అందుబాటులో ఉండే ఈ ఉత్పత్తులను తిరుమలతో పాటు తిరుచానూరు, గోవిందరాజస్వామి ఆలయం, శ్రీ కోదండరామస్వామి ఆలయం, కపిలేశ్వరస్వామి ఆలయం, శ్రీనివాసమంగాపురం, అప్పలాయగుంట, నారాయణవనం వంటి టీటీడీ ఆలయాల విక్రయ కేంద్రాల్లో, అలాగే అధికారిక వెబ్‌సైట్ ద్వారా విక్రయిస్తున్నారు. ఈ ఉత్పత్తులకు భక్తుల నుంచి మంచి ఆదరణ ఉండటంతో ప్రతి నెలా గణనీయమైన అమ్మకాలు నమోదవుతున్నాయి.
అయితే ఇదే డిమాండ్‌ను అవకాశంగా మార్చుకున్న కొందరు.. టీటీడీ అగరబత్తుల కాంబో ప్యాక్‌లను ఇతర చిన్న వస్తువులతో కలిపి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. టీటీడీ విక్రయించే ఒక కాంబో ప్యాక్ ధర సుమారు రూ.452 ఉండగా, కొన్ని ఆన్‌లైన్ వేదికల్లో అదే ఉత్పత్తిని రూ.1,000కుపైగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అసలు ఉత్పత్తేనా, అధిక ధర ఎందుకు వసూలు చేస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
టీటీడీ గతంలో క్యాలెండర్లు, డైరీల వంటి కొన్ని ఉత్పత్తుల అమ్మకానికి మాత్రమే పరిమిత అనుమతులు ఇచ్చినప్పటికీ, అగరబత్తుల విక్రయానికి అలాంటి అనుమతి ఇవ్వలేదని సమాచారం. అయినప్పటికీ టీటీడీ పేరు, లేబుళ్లు వినియోగిస్తూ కొన్ని సంస్థలు ఉత్పత్తులను అమ్మేస్తున్నాయి నిబంధనల ఉల్లంఘనగా భావిస్తున్నారు. గతంలో కూడా టీటీడీ లేబుళ్లను అక్రమంగా ముద్రించి విక్రయించిన ఘటనలపై విజిలెన్స్‌కు ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు.
భక్తుల విశ్వాసాన్ని దుర్వినియోగం చేసే ఇలాంటి విక్రయాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. టీటీడీ ఉత్పత్తులు కొనుగోలు చేసే సమయంలో అధికారిక విక్రయ కేంద్రాలు లేదా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఎంచుకోవడం ద్వారా అధిక ధరలు, నకిలీ ఉత్పత్తుల మోసాల నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి అంశాల్లో అప్రమత్తంగా ఉండటం ద్వారా భక్తులు ఆర్థిక నష్టాన్ని నివారించుకోవచ్చు.
Tirumala,Chittoor,Andhra Pradesh














