Last Updated:
యెమెన్ తీరానికి సమీపంలో ఎర్ర సముద్రంలో భారతీయ వాణిజ్య నౌకపై గుర్తుతెలియని దుండగులు పేలుడు పదార్థాలతో దాడి చేశారు. నౌక మునిగిపోగా, అందులోని 13 మంది భారతీయులను యెమెన్ కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించింది.
యెమెన్ పశ్చిమ తీరంలో ఎర్ర సముద్రంలో (Red Sea) భారతీయ వాణిజ్య నౌక ఎంఎస్వీ ఫైజ్ నూరే ఒలియాపై జరిగిన దాడిని భారతదేశం తీవ్రంగా ఖండించింది. మంగళవారం పేలుడు పదార్థాలతో నిండిన ఒక పడవ ఢీకొట్టడంతో భారత జెండాతో వెళ్తున్న ఈ నౌక పూర్తిగా సముద్రంలో మునిగిపోయినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. అదృష్టవశాత్తూ ఈ నౌకలో ఉన్న 13 మంది భారతీయులతో పాటు ఒక యెమెన్ పౌరుడిని యెమెన్ నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది సంయుక్తంగా రక్షించారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఈ 14 మంది సిబ్బందిని మోఖా నౌకాశ్రయానికి సురక్షితంగా తరలించినట్లు యెమెన్ నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్సెస్ వెల్లడించాయి. ఈ దాడికి తామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. ఎర్ర సముద్రంలో ఒక భారతీయ నౌకపై నేరుగా దాడి జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇలాంటి దాడులు జరగడం పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
భారత నౌకపై జరిగిన దాడిని కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తీవ్రంగా ఖండించారు. ఎటువంటి రెచ్చగొట్టే చర్యలు లేకుండానే అమాయకులైన నావికులపై ఇలాంటి దాడికి పాల్పడటం దారుణమని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు. భారతీయ పౌరుల భద్రతే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. బాధితులను రక్షించిన యెమెన్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న భారతీయ నావికుల భద్రతను పర్యవేక్షించాలని డైరెక్టర్ జనరల్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్‌ను (DGMA) ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.
ఈ ఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 4, 2026న జరిగిన ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని స్పష్టం చేసింది. నావికుల భద్రతను నిర్ధారించడానికి యెమెన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రతినిధులు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం చేసిన యెమెన్ కోస్ట్ గార్డ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలపై ఇలా వరస దాడులు జరగడం పట్ల భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు అంతర్జాతీయ వాణిజ్యానికి పెద్ద ముప్పుగా మారుతున్నాయని హెచ్చరించింది. వెంటనే వాణిజ్య నౌకలపై దాడులు ఆపాలని, అంతర్జాతీయ చట్టాలకు లోబడి వాణిజ్య నౌకల స్వేచ్ఛా రాకపోకలకు ఆటంకం కలిగించకూడదని భారత్ డిమాండ్ చేసింది. ఈ ఘటన నేపథ్యంలో ఎర్ర సముద్రంలో ప్రయాణించే ఇతర నౌకలకు భారత నౌకాదళం హై అలర్ట్ జారీ చేసింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Aug 04, 2026 10:58 PM IST














