Last Updated:
ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులు ఉండే ఓ పీజీ భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చిక్కుకున్న పలువురి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం పెను విషాదం చోటుచేసుకుంది. నైరుతి ఢిల్లీ ఆర్కే పురం పరిధిలోని సత్యనికేతన్ ప్రాంతంలో విద్యార్థులు నివసిస్తున్న ఒక పేయింగ్ గెస్ట్ (పీజీ) భవనం ఉన్నట్టుండి కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. భవనం కూలిన సమయంలో లోపల సుమారు 15 నుంచి 20 మంది విద్యార్థులు ఉన్నట్లు సౌత్ జోన్ వార్డ్ కమిటీ చైర్మన్ ధరమ్‌వీర్ సింగ్ తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు స్పందన దళం (NDRF), ఢిల్లీ అగ్నిమాపక దళం, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.














