తిరుమలలో గోవింద నామస్మరణ.. ధ్వజారోహణంతో మొదలైన బ్రహ్మోత్సవాలు..! brahmotsavams begin in tirumala. | | ACTPnews

News18


Last Updated:

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు..!

+

News18

తిరుమల కొండపై భక్తి పారవశ్యం నెలకొంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టడంతో తిరుమల అంతా గోవింద నామస్మరణతో మారుమోగుతోంది. స్వామివారి వైభవాన్ని వీక్షించేందుకు ఇప్పటికే భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు.

ధ్వజారోహణ వేడుకను ఆలయ అర్చకులు ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర కంకణాన్ని ధరించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ పరిసరాలు, మాడ వీధులు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. స్వామివారి వాహన సేవలను తిలకించేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం తిరుమలకు రానున్నారు. ముందుగా బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకోనున్న సీఎంకు అర్చకులు పరివట్టం కడతారు. అనంతరం శిరస్సుపై శ్రీవారి పట్టువస్త్రాలను ఉంచుకుని సీఎం ఆలయానికి చేరుకుని స్వామివారికి సమర్పించనున్నారు.

ఈసారి పట్టువస్త్రాలు సమర్పించడం చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా మారనుంది. ముఖ్యమంత్రిగా ఆయన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఇది 15వసారి కానుంది. ఇన్ని పర్యాయాలు ఈ సంప్రదాయాన్ని నిర్వహించిన ఏకైక ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డు నెలకొల్పనున్నారని అధికారులు తెలిపారు.

పట్టువస్త్రాల సమర్పణ అనంతరం రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రికి వేద పండితులు వేదాశీర్వచనం అందించనున్నారు. అనంతరం టీటీడీ నూతన సంవత్సరం డైరీ, క్యాలెండర్లను సీఎం ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమాల తర్వాత బ్రహ్మోత్సవాల్లో తొలి వాహన సేవగా నిర్వహించే పెద్దశేష వాహన సేవ ప్రారంభమవుతుంది.

పెద్దశేష వాహనంపై కొలువుదీరే శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఈ వాహన సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకోనున్నారు. ధ్వజారోహణంతో మొదలైన బ్రహ్మోత్సవ వేడుకలు ఇక వరుస వాహన సేవలతో మరింత వైభవంగా కొనసాగనున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *