Last Updated:
పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ కెప్టెన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ సహా 21 మంది పాక్ ప్రధానికి లేఖ రాశారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, 1992 ప్రపంచకప్ విజేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో ఉన్న ఆయనకు మెరుగైన వైద్య సేవలతో పాటు తగిన సదుపాయాలు కల్పించాలని కోరుతూ భారత దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్ సహా తొమ్మిది దేశాలకు చెందిన 21 మంది మాజీ కెప్టెన్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు లేఖ రాశారు. రాజకీయ నాయకులుగా కాకుండా, క్రికెట్ మైదానంలో కలిసి ఆడిన సహచరులుగా తాము ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం 14 మంది మాజీ కెప్టెన్లు రాసిన లేఖకు కొనసాగింపుగా తాజాగా మరో ఏడుగురు దిగ్గజాలు కలిసి ఈ విజ్ఞప్తి చేశారు. అడియాలా జైలులో ఉంటున్న 73 ఏళ్ల ఇమ్రాన్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఈ లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.














