Last Updated:
గోవింద నామంతో మార్మోగిన ఏడుకొండలు.. స్వర్ణ గరుడ వాహనంపై స్వామివారిని చూసేందుకు ఎన్ని లక్షల మంది వచ్చారో తెలుసా?
తిరుమల పుణ్యక్షేత్రం గోవింద నామస్మరణతో మార్మోగింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని కనులారా చూసేందుకు వచ్చిన భక్తజనంతో ఏడుకొండలు పులకించిపోయాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన, విశిష్టమైన గరుడసేవ శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. కన్నుల పండువగా సాగిన ఈ ఉత్సవంలో భక్తిశ్రద్ధల నడుమ స్వర్ణ గరుడ వాహనంపై కొలువుదీరిన శ్రీమలయప్పస్వామివారు తన భక్తులకు దివ్యదర్శనం ప్రసాదించారు. సాక్షాత్తూ వైకుంఠనాథుడు గరుడ వాహనంపై విహరిస్తున్న అద్భుత దృశ్యాన్ని చూసి లక్షలాది మంది భక్తులు పరవశించిపోయారు. స్వామివారి దివ్య మంగళరూపాన్ని కనులారా వీక్షిస్తూ ఆ దేవదేవుడికి భక్తిభావంతో ప్రణమిల్లారు. సాటిలేని ఈ వాహన సేవను చూడటం జన్మజన్మల పుణ్యఫలంగా భక్తులు భావించారు.
సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో స్వామివారు గరుడ వాహన మండపం నుంచి వెలుపలకు రాగానే ఉద్విగ్న వాతావరణం నెలకొంది. వాహనసేవ కోసం నాలుగు మాడ వీధుల్లో ఏర్పాటు చేసిన గ్యాలరీలన్నీ జనసంద్రంగా మారాయి. ఎటు చూసినా ఇసుకవేస్తే రాలనంతగా భక్తజనమే కనిపించడంతో తిరుమల వీధులు కిక్కిరిశాయి. రాత్రి వేళ దేదీప్యమానమైన విద్యుద్దీపాల కాంతుల్లో స్వర్ణ గరుడ వాహనంపై ఊరేగుతున్న మలయప్పస్వామిని చూసేందుకు వచ్చిన భక్తులు ఎంతో ఆసక్తితో, కళ్లప్పగించి ఎదురుచూశారు. అడుగడుగునా కర్పూర నీరాజనాలు అర్పిస్తూ ఆ దేవదేవుడికి అత్యంత భక్తిప్రపత్తులతో ఘనస్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ మాడ వీధుల్లో గరుడ వాహన సేవ ఎంతో నయనానందకరంగా సాగింది.
ఈ మహా ఘట్టాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా వీక్షించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పకడ్బందీగా భారీ స్థాయిలో విస్తృత ఏర్పాట్లు చేసింది. నాలుగు మాడ వీధుల్లోని 190 గ్యాలరీల్లో సుమారు లక్షా ఎనభై వేల మంది భక్తులు ఒకేసారి గరుడసేవను వీక్షించేలా విశేష సదుపాయాలు కల్పించారు. శుక్రవారం రాత్రి నుంచే చాలా గ్యాలరీలు భక్తులతో నిండిపోవడం గమనార్హం. శనివారం తెల్లవారుజాము నుంచే అక్కడే వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వారికి ఎప్పటికప్పుడు వేడి వేడి పాలు, రుచికరమైన అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ లాంటి పానీయాలు, అల్పాహారం నిరంతరాయంగా ఉచితంగా అందించారు.
లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు సేవలందించేందుకు భారీ యంత్రాంగం అహర్నిశలు శ్రమించింది. అన్నప్రసాదం, తాగునీటి పంపిణీ బాధ్యతలతో పాటు క్యూలైన్లలో రద్దీ నియంత్రణ, జనసందోహంలో తప్పిపోయిన చిన్నారులను సులభంగా గుర్తించేందుకు వీలుగా ముందస్తు ట్యాగింగ్ లాంటి సేవల కోసం రెండు వేల మంది శ్రీవారి సేవకులను టీటీడీ ప్రత్యేకంగా నియమించింది. భక్తులకు అందుతున్న సౌకర్యాలను ప్రతి క్షణం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు 600 మంది సిబ్బందిని కేటాయించారు. తిరుమలలోని ఎనిమిది అత్యంత కీలక ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రత్యేకంగా సెక్టోరల్ అధికారులను ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలపాటు పరిస్థితులను నిశితంగా సమీక్షించారు. భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.













