Last Updated:
జాతర అంటే ఆటలు, పాటలు, సందడి.. రకరకాల పోటీలు కామన్. కానీ గుజరాత్‌లో జరుగుతున్న ఓ ప్రసిద్ధ మేళాలో జరిగిన పోటీ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. పోటీదారులకు 30 నిమిషాల సమయం ఇచ్చి.. ఎన్ని లడ్డూలు తినగలరో చూడగా.. ఓ వ్యక్తి ఏకంగా 28 లడ్డూలు తిని మొదటి స్థానంలో నిలిచాడు.
జాతర అంటే ఆటలు, పాటలు, సందడి.. రకరకాల పోటీలు కామన్. కానీ గుజరాత్‌లో జరుగుతున్న ఓ ప్రసిద్ధ మేళాలో జరిగిన పోటీ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. పోటీదారులకు 30 నిమిషాల సమయం ఇచ్చి.. ఎన్ని లడ్డూలు తినగలరో చూడగా.. ఓ వ్యక్తి ఏకంగా 28 లడ్డూలు తిని మొదటి స్థానంలో నిలిచాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లా థాన్ తాలూకాలో ప్రస్తుతం ప్రసిద్ధ తరనేతర్ లోక్ మేళా జరుగుతోంది. ప్రతి ఏడాది భాద్రపద మాసం ప్రారంభంలో నిర్వహించే ఈ మేళా ఈసారి సెప్టెంబర్ 14న ప్రారంభమైంది. త్రినేత్రేశ్వర్ మహాదేవుడి సన్నిధిలో నాలుగైదు రోజుల పాటు జరిగే ఈ జాతరలో సంప్రదాయ కార్యక్రమాలతో పాటు పలు వినూత్న పోటీలు నిర్వహిస్తారు.
మేళా రెండో రోజైన సెప్టెంబర్ 15న రూరల్ ఒలింపిక్స్‌లో భాగంగా లడ్డూలు తినే పోటీ నిర్వహించారు. సురేంద్రనగర్ జిల్లాకు చెందిన 25 నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 28 మంది ఈ పోటీలో పాల్గొన్నారు. పోటీదారులకు శనగపిండితో తయారు చేసిన తీపి లడ్డూలను అందించి.. వాటిని 30 నిమిషాల్లో వీలైనన్ని తినాలని నిర్వాహకులు నిబంధన పెట్టారు.
పోటీ ప్రారంభమైనప్పటి నుంచే పాల్గొన్నవారిలో ఉత్సాహం కనిపించింది. ఒకరిని మించి మరొకరు లడ్డూలు తింటూ ముందుకు సాగారు. చివరి దశకు వచ్చేసరికి ఐదుగురి మధ్య గట్టి పోటీ నెలకొంది. సమయం పూర్తయ్యే వరకు పోటీదారులు తమ వేగాన్ని కొనసాగించారు. దీంతో పోటీని చూసేందుకు వచ్చిన మేళా సందర్శకుల్లో కూడా ఉత్కంఠ కనిపించింది.
చివరకు వించియా తాలూకాలోని ఓరి గ్రామానికి చెందిన బల్వంత్‌భాయ్ రాఘవాణి అందరికంటే ఎక్కువగా 28 లడ్డూలు తిని మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. నిర్ణీత 30 నిమిషాల సమయంలో 28 లడ్డూలు తినడంతో ఆయన విజయం సాధించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఆయన గెలుపుతో మేళా ప్రాంగణంలో సందడి నెలకొంది.
తరనేతర్ మేళా సంప్రదాయాలు, జానపద కళలు, గ్రామీణ సంస్కృతితో పాటు ఇలాంటి ప్రత్యేక పోటీలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈసారి నిర్వహించిన లడ్డూ తినే పోటీ మేళాకు వచ్చిన వారిని ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మొదటి స్థానంలో నిలిచిన బల్వంత్‌భాయ్ రాఘవాణికి ఏఎస్పీ వేదికా బిహానీ రూ.2,000 నగదు బహుమతిని అందించారు. సంప్రదాయం, వినోదం కలిసిన ఈ పోటీ మేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.














