టీటీడీ ఆలయాల్లో ముగిసిన నగల తనిఖీ.. శ్రీవారి ఆభరణాల్లో బయటపడ్డ లోటుపాట్లు..! TTD temple jewellery audit. | | ACTPnews

News18


Last Updated:

టీటీడీ 81 ఆలయాల తిరువాభరణాల జుడ్తీ పూర్తి, పెద్ద అక్రమాలు లేవని నివేదిక, రూ.2.33 లక్షల లోటుపై బాధ్యుల నుంచి వసూలు, ఈ-తిరువాభరణం సిస్టమ్ ద్వారా పారదర్శకతకు నిర్ణయం

News18
News18

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని 81 ఆలయాల్లో నిర్వహించిన తిరువాభరణాల వార్షిక భౌతిక తనిఖీ (జుడ్తీ) ప్రక్రియ పూర్తైంది. ఈ తనిఖీలకు సంబంధించిన సమగ్ర నివేదికను టీటీడీ పాలకమండలి ఆమోదించింది. ఆలయాల్లో స్వామివారికి నిత్య కైంకర్యాలు, బ్రహ్మోత్సవాలు, ఇతర ధార్మిక ఉత్సవాల సందర్భంగా వినియోగించే ఆభరణాలపై ప్రత్యేకంగా పరిశీలన చేపట్టగా, ఎలాంటి అక్రమాలు లేదా అవకతవకలు జరిగినట్లు గుర్తించలేదని అధికారులు వెల్లడించారు.

అయితే ఆభరణాల నిరంతర వినియోగం కారణంగా సహజసిద్ధంగా ఏర్పడే అరుగుదల వల్ల కొన్ని నగల బరువులో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. ఈ మార్పులను అధికారిక రికార్డుల్లో నమోదు చేసేందుకు పాలకమండలి అనుమతి ఇచ్చింది. తిరువాభరణాల నిర్వహణను మరింత పారదర్శకంగా, ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ఇకపై వాటి పూర్తి వివరాలను ‘ఈ-తిరువాభరణం మేనేజ్‌మెంట్ సిస్టమ్ లో నమోదు చేయాలని నిర్ణయించింది.

2025 మార్చిలో నిర్వహించిన ఈ తనిఖీల్లో ఆలయాల వారీగా ఆభరణాల భద్రత, సంరక్షణ, వినియోగం, నిల్వ విధానాలను సవివరంగా పరిశీలించారు. ఈ క్రమంలో కొన్ని ఆలయాల్లో ఆభరణాలకు అమర్చిన రాళ్లు లేదా ఇతర భాగాలకు సంబంధించిన స్వల్ప లోటుపాట్లు బయటపడ్డాయి. మొత్తం రూ.2.33 లక్షల మేర విలువైన లోటు నమోదైనట్లు నివేదికలో వెల్లడైంది.

ఇందులో తిరుమల శ్రీవారి ఆలయంలో రూ.1.51 లక్షల విలువైన లోటు నమోదుకాగా, తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో రూ.29,278, శ్రీనివాస మంగాపురం ఆలయంలో రూ.28,351 విలువైన లోటు గుర్తించారు. మిగిలిన ఆలయాలకు సంబంధించిన వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

ఈ లోటుపాట్లకు సంబంధించి బాధ్యుల నుంచి ఆరు నెలల్లోగా సంబంధిత మొత్తాన్ని వసూలు చేయాలని లేదా సరైన వివరణతో పాలకమండలి అనుమతి పొందాలని టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. తిరువాభరణాలు శ్రీవారి సేవలో అత్యంత పవిత్రమైనవని, వాటి భద్రత, నిర్వహణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని పాలకమండలి స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఆభరణాల సంరక్షణ, తనిఖీ విధానాలను మరింత పటిష్టం చేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పూర్తి పారదర్శకత తీసుకురావడంపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *