Last Updated:
తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌లో విశేష్ శర్మ సొంత కోర్స్‌లోనే అదరగొట్టాడు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్‌లో జరిగిన టోర్నమెంట్లో స్థానిక ఆటగాడు విశేష్ శర్మ తన సత్తా చూపించాడు. 21 అండర్ 259 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచి తొలి ప్రొఫెషనల్ టైటిల్ అందుకున్నాడు.
హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్‌లో జరిగిన రూ.1 కోటి తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌లో స్థానిక ఆటగాడు విశేష్ శర్మ అదరగొట్టాడు. ఉత్కంఠగా సాగిన చివరి రౌండ్లో ఒత్తిడిని తట్టుకుని ఆడిన 19 ఏళ్ల విశేష్ తన కెరీర్లో తొలి ప్రొఫెషనల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫైనల్ రౌండ్లో ఒక అండర్ 69 స్కోర్ చేసిన విశేష్ మొత్తం 21 అండర్ 259 స్కోర్‌తో టోర్నమెంట్‌ను ముగించాడు. రెండో స్థానంలో నిలిచిన నోయిడాకు చెందిన అమర్దీప్ మాలిక్ కంటే ఒక స్ట్రోక్ ముందంజలో నిలిచాడు. ఇది తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 12వ ఎడిషన్. డీపీ వరల్డ్ పీజీటీఐలో రెండో సీజన్ ఆడుతున్న విశేష్ 60-66-64-69 స్కోర్లతో టైటిల్ గెలిచాడు. ఈ విజయంతో అతడికి రూ.15 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. 2026 ఆర్డర్ ఆఫ్ మెరిట్లో 25వ స్థానం నుంచి 14వ స్థానానికి ఎగబాకాడు. దీంతో ఈ సీజన్లో అతడి మొత్తం ఆదాయం రూ.30,93,550కి చేరింది. ఈ విజయంతో డీపీ వరల్డ్ ఇండియా ఛాంపియన్‌షిప్‌లో కూడా తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు.














