నీ సభలో మరణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇస్తావు? సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టు భారీ షాక్.. ఆ ఉద్యోగులు రద్దు! | | ACTPnews

News18


Last Updated:

2025లో కరూర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన 41 మందిలో 31 కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మధురై హైకోర్టు రద్దు చేసింది.

News18
News18

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల నిర్ణయాన్ని మధురై బెంచ్‌ హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు విచారణ అనంతరం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

2025లో కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ నిర్వహించిన ప్రజా సమావేశంలో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో మరణించిన వారిలో 31 మంది కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా నియామక ఉత్తర్వులు అందజేశారు.

అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చెన్నై హైకోర్టు, మధురై బెంచ్‌లో పలు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి. చెన్నైకి చెందిన న్యాయవాది ఎన్. ప్రభాకరన్ దాఖలు చేసిన పిటిషన్‌లో, బాధిత కుటుంబాలకు ఇప్పటికే ప్రభుత్వం రూ.10 లక్షలు, అలాగే టీవీకే తరఫున రూ.20 లక్షల పరిహారం అందించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ప్రస్తుత నిబంధనలకు విరుద్ధమని వాదించారు.

పిటిషన్‌లో మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించారు. 2020లో జారీ చేసిన కరుణా నియామకాల ప్రభుత్వ ఉత్తర్వు (Compassionate Appointment G.O.)లో రాజకీయ సభలు లేదా సమావేశాల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధన లేదని పేర్కొన్నారు. అలాగే కేసు ఇంకా దర్యాప్తులో ఉండగానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం వల్ల విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని, సాక్షులపై పరోక్ష ఒత్తిడి ఏర్పడే పరిస్థితి రావచ్చని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఈ వాదనలను పరిశీలించిన మధురై హైకోర్టు, కరూర్ ఘటన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వ ఉత్తర్వును రద్దు చేసింది. కేసు స్వభావం, అమల్లో ఉన్న నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక ప్రశ్నలు కూడా లేవనెత్తింది. బాధిత కుటుంబాలకు నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం బదులుగా, స్వయం ఉపాధి కోసం శిక్షణ, వృత్తి నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాలు అందించి వారిని స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించవచ్చుకదా అని ప్రశ్నించింది.

అలాగే, కరూర్ ఘటనలో ఉద్యోగాలు ఇస్తే, శివకాశి బాణాసంచా కర్మాగార ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కూడా ఇదే విధంగా ఉద్యోగాలు ఇవ్వాలా?, ప్రభుత్వ బస్సు ఢీకొని రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కూడా కరుణా నియామకాలు వర్తిస్తాయా? అనే ప్రశ్నలను న్యాయమూర్తులు లేవనెత్తారు. ఒక ఘటనకు ఇచ్చే మినహాయింపులు భవిష్యత్తులో ఇతర కేసులపైనా సమాన డిమాండ్లకు దారితీసే అవకాశాన్ని కోర్టు ప్రస్తావించింది.

తాజా తీర్పుతో కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే నిర్ణయం రద్దు కాగా, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *