విజయ్ కేబినెట్‌లోకి వీసీకే, ఐయూఎంఎల్.. తమిళనాడు మంత్రివర్గంలో సరికొత్త రికార్డు ! | | ACTPnews

News18


Last Updated:

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంత్రివర్గాన్ని విస్తరిస్తూ కూటమి భాగస్వామ్య పక్షాలైన వీసీకే, ఐయూఎంఎల్ నేతలను కేబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో మొత్తం మంత్రుల సంఖ్య 34కు చేరగా, దళిత సామాజికవర్గానికి చారిత్రాత్మక ప్రాతినిధ్యం లభించింది.

News18
News18

తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ శుక్రవారం తన మంత్రివర్గాన్ని మరింత విస్తరించారు. లోక్ భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార ఉత్సవంలో కూటమి భాగస్వామ్య పక్షాలైన విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) ఎమ్మెల్యే వన్ని అరసు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) నేత ఏఎం షాజహాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం నాడే 23 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా, తాజాగా వీరిద్దరి చేరికతో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆయా పార్టీలు అధికారికంగా భాగస్వామ్యమయ్యాయి. ఈ తాజా విస్తరణతో తమిళనాడు కేబినెట్ బలం 34కు చేరింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ మొత్తం స్థానాల్లో గరిష్టంగా 15 శాతం అంటే 35 మంది వరకే మంత్రులుగా ఉండటానికి వీలుండటంతో ఇప్పుడు కేవలం ఒకే ఒక్క ఖాళీ మిగిలి ఉంది.

ఈ కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేశారు. వన్ని అరసు రాకతో మంత్రివర్గంలో దళిత మంత్రుల సంఖ్య ఎనిమిదికి చేరింది. తమిళనాడు రాజకీయ చరిత్రలోనే ఈ స్థాయి అత్యధిక ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత విజయ్ గత మే 10వ తేదీన తొమ్మిది మంది మంత్రులతో కలిసి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

కూటమిలోని మరో కీలక భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ మంత్రివర్గంలో చోటు దక్కింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, తిరు పి. విశ్వనాథన్ గురువారమే మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అధికార కూటమిలో భాగస్వామి కావడం ఇదే ప్రథమం. రాష్ట్రంలో 1967 మార్చిలో ముగిసిన ఎం. భక్తవత్సలం పాలన తర్వాత మళ్లీ కాంగ్రెస్‌కు మంత్రిపదవులు దక్కాయి.

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అత్యధికంగా 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అవినీతి నిర్మూలన, ఉచిత విద్య, యువతకు ఉపాధి, మహిళా సంక్షేమమే ధ్యేయంగా నటుడి నుండి రాజకీయ నేతగా మారిన విజయ్ చేసిన ప్రచారం పట్టణ యువతను, మధ్యతరగతి ఓటర్లను భారీగా ఆకర్షించింది. దాదాపు 85 శాతం నమోదైన రికార్డు ఓటింగ్ శాతంతో విజయ్ ప్రభంజనం సృష్టించి పీఠాన్ని దక్కించుకున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports