Last Updated:
ప్రముఖ ఐటీ కంపెనీ అసలు బండారం బయటపెట్టిన లేడీ టెక్కీ.. వీడియో వైరల్.
కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించడం తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. లక్ష్యాల సాధన పేరుతో సంస్థలు, ఉద్యోగుల కష్టసుఖాలను పట్టించుకోవడం మానేశాయి. తాజాగా ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ మానవత్వం మరచి ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఆరోగ్యం బాగాలేదని సెలవు పెడితే, తీవ్ర వేధింపులకు గురిచేసి, చివరకు ఎలాంటి సహేతుకమైన కారణం లేకుండానే ఉద్యోగం నుంచి తొలగించారని భావన అనే యువతి ఏకంగా పోలీసులను ఆశ్రయించింది. టెక్ మహీంద్రా కంపెనీకి వ్యతిరేకంగా ఆమె చేసిన ఫిర్యాదు ఇప్పుడు ఐటీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది.
భావన అనే యువతి టెక్ మహీంద్రా సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా విధులు నిర్వర్తిస్తోంది. ఇటీవల ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. శారీరకంగా కోలుకునేందుకు వైద్యుల సలహా మేరకు 13 రోజుల పాటు సెలవు తీసుకుంది. అయితే, అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా కంపెనీ యాజమాన్యం ఆమెను ఏమాత్రం ప్రశాంతంగా ఉండనివ్వలేదు. త్వరగా ఆఫీసుకు రావాలంటూ వరుసగా ఈ-మెయిల్స్ పంపుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిందని బాధితురాలు ఆరోపించింది. అనారోగ్యం పాలైన సమయంలో సంస్థ అండగా నిలవకపోగా ఇలా వేధించడం ఆమెను తీవ్రంగా కలచివేసింది.
ఆ చేదు అనుభవం నుంచి కోలుకోకముందే భావనకు మరో కష్టం ఎదురైంది. తన చిన్నారి పాపకు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో, కన్నబిడ్డను కంటికి రెప్పలా చూసుకునేందుకు ఆమె మళ్లీ సెలవు అడగాల్సి వచ్చింది. కన్న పేగు తల్లడిల్లుతున్న ఆ విపత్కర సమయంలోనూ యాజమాన్యం ఏమాత్రం కనికరం చూపలేదు. “ఇంకా ఎన్ని రోజులు సెలవులో ఉంటావు? వెంటనే విధుల్లోకి చేరాలి” అంటూ ఉన్నతాధికారులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. పాప బాగోగులు చూసుకునేందుకు కాస్త సమయం అడిగినందుకు, ఏమాత్రం జాలి లేకుండా భావనను ఉన్నఫళంగా ఉద్యోగం నుంచి తొలగించారు.
ఆఫీసులో పని వాతావరణం సైతం అత్యంత దారుణంగా ఉంటుందని భావన ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా పై అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి అక్కడ ఉందని వాపోయింది. తన ఐటీ కెరీర్లో ఇలాంటి నరకం చూపించే కంపెనీని ఎక్కడా చూడలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సంస్థలో ఉద్యోగులను యంత్రాల్లా చూస్తున్నారని ఆమె మండిపడింది.
కారణం లేకుండా నన్ను జాబ్ నుండి తొలగించారు
టెక్ మహీంద్రా కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతిఆరోగ్యం బాగాలేదని 13 రోజులు సెలవు పెడితే, మెయిల్స్ ద్వారా త్వరగా ఆఫీసుకు రావాలని కంపెనీ యాజమాన్యం తరచూ వేధించిందని భావన అనే యువతి ఆరోపణ
అనంతరం తన పాపకు ఆరోగ్యం బాగాలేదని సెలవు… pic.twitter.com/Wgv6mBoNfU
— Telugu Scribe (@TeluguScribe) July 23, 2026
మహిళా ఉద్యోగులకు కేవలం ఆఫీసు పనులే కాకుండా, కుటుంబ బాధ్యతలు కూడా మెండుగా ఉంటాయని ఐటీ కంపెనీల యాజమాన్యాలు గుర్తించాలని భావన విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న తల్లుల పట్ల ఇంత కఠినంగా, అమానుషంగా వ్యవహరించడం ఏమాత్రం సరికాదని హితవు పలికింది. కార్పొరేట్ సంస్థలు లాభాలతో పాటు కాస్త మానవత్వంతో ఆలోచించాలని కోరుతూ తనకు జరిగిన అన్యాయంపై న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా ఈ అంశంపై టెక్ మహీంద్రా అధికారికంగా ఇంకా స్పందించలేదు.
Hyderabad,Telangana













