Last Updated:
పీఓకేలో హతమైన ఉగ్రవాది హంజా బుర్హాన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. చదువుకుంటానని వెళ్లి కొడుకు ఉగ్రవాద బాట పట్టాడని, అతని వల్ల కుటుంబం ఎంతో నరకం చూసిందని, వాడు చావడమే మంచిదైందని పేర్కొన్నారు.
పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, అల్-బదర్ ఉగ్రవాద సంస్థ కమాండర్ హంజా బుర్హాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లో హతమయ్యాడు. ముజఫరాబాద్‌లో అజ్ఞాత వ్యక్తులు జరిపిన తుపాకీ కాల్పుల్లో అతడు అక్కడికక్కడే మరణించాడు. గత ఆరేళ్లుగా భారత భద్రతా సంస్థలు ఇతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. కాశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రవాద చర్యల్లో ఈయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. చదువు నిమిత్తం పాకిస్తాన్ వెళ్లిన ఈ యువకుడు అక్కడ ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. ఈ ఉగ్రవాది మరణంపై అతని తండ్రి స్పందిస్తూ.. తన కొడుకు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడని, అతని వల్ల కుటుంబం ఎన్నో కష్టాలు పడిందని పేర్కొంటూ.. అతడు చనిపోవడమే మంచిదైందని సంచలన వ్యాఖ్యానంచేశారు.
అల్-బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన హంజా బుర్హాన్‌ను భారత ప్రభుత్వం 2022లో అధికారికంగా ఉగ్రవాదిగా ప్రకటించింది. పుల్వామా ప్రాంతానికి చెందిన ఈయన 2017లో ఎంబీబీఎస్ చదువుతానని చెప్పి పాకిస్తాన్ చేరాడు. అక్కడ వైద్య విద్యను వదిలిపెట్టి సరిహద్దుల్లో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే ఆ సంస్థలో కీలక కమాండర్‌గా ఎదిగాడు.

దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలో యువతను తప్పుదోవ పట్టించి ఉగ్రవాదం వైపు నడిపించడంలో ఇతడు ముఖ్య భూమిక పోషించాడు. పుల్వామా నుండి షోపియాన్ వరకు భారీ ఉగ్ర నెట్‌వర్క్‌ను నిర్మించాడు. 2019 ఫిబ్రవరి 14న జరిగిన ఘోరమైన పుల్వామా దాడి వెనుక ఈయన ప్రమేయం బలంగా ఉంది. ఆ దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు.
పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్న భారత వ్యతిరేక ఉగ్రవాదులను అజ్ఞాత వ్యక్తులు టార్గెట్ చేయడం గత రెండేళ్లుగా ఎక్కువైంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి పెద్ద సంస్థల అగ్రనేతలు వరుసగా హతమవుతున్నారు. ఈ తరహా దాడులతో సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద ముఠాల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి.
ఈ రహస్య హత్యల వల్ల ఉగ్రవాద సంస్థల్లో చేరే యువకుల సంఖ్య భారీగా తగ్గింది. వారి నైతిక బలం పూర్తిగా దెబ్బతిన్నట్లు రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి భద్రతలను కాపాడేందుకు భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత ఈ ఉగ్ర నెట్‌వర్క్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













