‘భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కింద తిరుపతి నుంచి యూకేకు తొలిసారిగా జరిగిన మామిడి గుజ్జు ఎగుమతి మన రైతులకు అంతర్జాతీయ మార్కెట్ల తలుపులు తెరుస్తోంది. ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా సరికొత్త వ్యాపార అవకాశాలను సృష్టించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీకి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జీకి నా హృదయపూర్వక అభినందనలు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచస్థాయితో పోటీపడే ఫుడ్ ప్రాసెసింగ్ పర్యావరణ వ్యవస్థను నిర్మించేందుకు మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం. దీనిద్వారా కేవలం ఉత్పత్తి పరిమాణమే కాకుండా దానికి అదనపు విలువను జోడించి మన రైతులు మరింత ఎక్కువ ఆదాయం గడించేలా చూస్తాం. మన ఆంధ్రా రుచులను ప్రపంచానికి పరిచయం చేసే దిశగా ఇదొక అద్భుతమైన ముందడుగు’ అని ఆయన ట్వీట్ చేశారు.
కాగా ఎఫ్టీఏ కుదరక ముందు ఉన్న అధికారిక గణాంకాలను పరిశీలిస్తే ఈ ఒప్పందం ప్రాధాన్యత ఇట్టే అర్థమవుతుంది. పీఐబీ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భారత్ 57 బిలియన్ డాలర్లకు పైగా వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అటు బ్రిటన్ కూడా ఏటా 90 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తులను ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే బ్రిటన్‌కు భారత్ చేస్తున్న ఎగుమతుల విలువ కేవలం 1.11 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండటం గమనార్హం. బ్రిటన్ మార్కెట్లో భారతీయ తేయాకు, మామిడి, ద్రాక్ష, సుగంధ ద్రవ్యాలు, సముద్ర ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంది. తాజా ఒప్పందంతో ఈ అపారమైన వాణిజ్య అవకాశాలను సులభంగా అందిపుచ్చుకునే మార్గం సుగమమైంది.
తిరుపతికి చెందిన శ్రీ వర్ష ఫుడ్స్ సంస్థ ఈ మామిడి గుజ్జును యూకేకు ఎగుమతి చేస్తూ ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రంగానికి సరికొత్త దారులు చూపింది. అపెడా రీజనల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పీ నాయుడు, విదేశీ వాణిజ్య విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఫణి కిరణ్, ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్ దేవముని రెడ్డి, తిరుపతి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జయభారత్ రెడ్డి తదితరులు ఈ తొలి కంటైనర్‌ను ప్రారంభించారు. రైతులు, ప్రాసెసర్లు, ఎగుమతిదారుల మధ్య సమన్వయం పెరిగితే రాష్ట్రం నుంచి ఉద్యానవన ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరుగుతాయని జయభారత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అపారమైన ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన వివరించారు.
తిరుపతి నుంచి మొదలైన ఈ ఎగుమతులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. రైతులకు ఇదొక పెద్ద మార్కెట్ అవకాశమని, తద్వారా వారు అత్యధిక లాభాలు పొందుతారని గోయల్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారత్, బ్రిటన్ దేశాలు ఉమ్మడి ప్రజాస్వామ్య విలువల పునాదిగా వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ రంగాల్లో బలమైన సహకారాన్ని పంచుకుంటున్నాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ నెలలో సీఈటీఏ (సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం) అమలులోకి రావడంతో ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లండన్‌లోని భారత హైకమిషన్ సైతం ఈ ఒప్పందం ప్రాథమిక విజయానికి ఈ ఎగుమతే అసలైన నిదర్శనమని సోషల్ మీడియాలో కొనియాడింది.
జూలై 15న ఇండో-బ్రిటన్ ఎఫ్టీఏ అధికారికంగా అమలులోకి రాగా.. ఈ భాగస్వామ్యాన్ని మోదీ, గోయల్ ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. సామాజిక భద్రతా ఒప్పందంతో పాటు సీఈటీఏ అమలులోకి రావడంతో రెండు దేశాల ఆర్థిక సంబంధాలు మరింత లోతుగా మారనున్నాయని ప్రధాని ఆకాంక్షించారు. దాదాపు 99 శాతం భారతీయ ఎగుమతులకు బ్రిటన్ మార్కెట్లో సుంకం లేని (జీరో డ్యూటీ) ప్రవేశం లభించిందని పీయూష్ గోయల్ వివరించారు. టెక్స్‌టైల్స్, తోలు ఉత్పత్తులు, రత్నాలు-ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువులు, సముద్ర ఉత్పత్తులు, రసాయనాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎంఎస్ఎంఈలు, రైతులు, తయారీదారులకు అపూర్వమైన అవకాశాలు సృష్టించబడ్డాయన్నారు. ఐటీ, ప్రొఫెషనల్, ఆర్థిక, వ్యాపార సేవల రంగాలకు కొత్త సరిహద్దులు తెరుచుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
The first-ever mango pulp export from Tirupati to the UK under the India–UK FTA opens newer gateways to global markets for our farmers.
My compliments to Hon’ble PM Shri @narendramodi ji and Union Minister @PiyushGoyal ji for opening new export opportunities through this… https://t.co/sR6f87WA95— Lokesh Nara (@naralokesh) July 22, 2026
సీఈటీఏ అమలులోకి రావడంతో భారతీయ రైతులకు ప్రత్యేకంగా అనేక లాభాలు చేకూరనున్నాయి. దాదాపు అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులతో పాటు 97.1 శాతం ప్రాసెస్డ్ ఫుడ్స్ పైన ఎలాంటి సుంకం లేకుండా నేరుగా బ్రిటన్ మార్కెట్లోకి ప్రవేశించే అరుదైన వెసులుబాటు లభించింది. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (ఎఫ్‌పీఓ), ప్యాక్‌హౌస్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, లాజిస్టిక్స్ రంగాల్లో భారీ స్థాయిలో గ్రామీణ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. దేశ ఆహార భద్రత, రైతుల జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తూనే.. 90 బిలియన్ డాలర్లకు పైగా ఉన్న బ్రిటన్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లో భారత్‌కు తక్షణ పోటీతత్వం లభించడం రాబోయే రోజుల్లో అతిపెద్ద మార్పునకు నాంది పలుకుతుంది.













