మెటా సోషల్ మీడియా వేదికలపైబాలల లైంగిక దుర్వినియోగ కంటెంట్, డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేశారు. కేంద్ర ఐటీ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన కీలక సమావేశంలో ప్లాట్‌ఫారమ్ నిర్వహణ లోపాలపై తీవ్ర చర్చ జరిగింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐటీ చట్టం ద్వారా లభించే ‘సేఫ్ హార్బర్’ చట్టపరమైన రక్షణను రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించింది.
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ రూ.299, రూ.579, రూ.619 విలువైన ప్లాన్లను తొలగించింది. 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్యాక్ స్థానంలో వినియోగదారులు ఇకపై రూ.349 ప్లాన్‌తో రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా అపరిమిత కాల్స్‌తో పాటు ప్రతిరోజూ 2జీబీ డేటా, యాపిల్ మ్యూజిక్ ఉచితంగా పొందవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక వంటి అన్ని అత్యవసర సేవలకూ ఇకపై ‘డయల్ 112’ ఒకే నంబర్‌గా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు ఉన్న 100 నంబర్ స్థానంలో ఏఐ సాంకేతికతతో రూపొందించిన ఈ ఏకీకృత వ్యవస్థను డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. బాధితుల లొకేషన్‌ను తక్షణమే గుర్తించి సంబంధిత బృందాలు వేగంగా సహాయక చర్యలు చేపడతాయి.
ఢిల్లీలో నిర్వహించిన చిట్‌చాట్‌లో ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని తిడితే బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క కేసు అయినా పెట్టారా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రధానిని దూషిస్తే తమ ప్రభుత్వం కేసు నమోదు చేసిందని చెప్పారు. ఒక డీఎస్పీని బదిలీ చేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారని.. అధికారిని బదిలీ చేయడం ప్రభుత్వానికి ఉన్న అధికారమని పేర్కొన్నారు. తన పరిధిలో ఉంది కాబట్టే బదిలీ చేశానని చెప్పారు.
పొగాకు రైతుల్ని పరామర్శించిన వైఎస్ జగన్.. రాష్ట్రంలో ఏ రైతూ సంతోషంగా లేరనీ, అందరూ నష్టపోతున్నారని అన్నారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. దళారులు, వ్యాపారుల సిండికేట్ వల్ల మద్దతు ధర లభించక రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి ఆదుకున్నామని గుర్తుచేశారు. తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకుని పొగాకును మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ విజయప్రసాద్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. సుమారు రూ.3,000 కోట్ల వెల్ఫేర్ గ్రూప్ చిట్‌ఫండ్ కుంభకోణం, మనీలాండరింగ్ ఆరోపణలపై విశాఖపట్నం, హైదరాబాద్‌లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బాధితుల డిపాజిట్ల అక్రమ మళ్లింపునకు సంబంధించిన అనేక కీలక ఆధారాలు, బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ రూ.10,000 కోట్లకు పైగా ఉండొచ్చని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రరూపం దాలుస్తున్న డాల్ఫిన్ తుఫాను ప్రభావంతో భారత వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రా, తెలంగాణ జిల్లాల్లో రాబోయే కొన్ని రోజులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, తీరప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.
హోర్ముజ్ జలసంధిలో ఓడలపై దాడులకు పాల్పడితే ఇరాన్‌పై రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ చూడని రీతిలో అతిపెద్ద దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ తీరు వల్ల అంతర్జాతీయ ఇంధన రవాణాకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నౌకలపై దాడి జరిగిన ప్రతిసారీ ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలను ధ్వంసం చేస్తామని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.
దుబాయ్‌లోని జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఏడు వరుస భారీ పేలుళ్లు సంభవించాయి. రేవు సమీపంలోని ఇంధన నిల్వ గిడ్డంగిలో అగ్నిప్రమాదం జరగడం వల్ల దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఘటన స్థలాన్ని వీడియో తీసిన ఇద్దరు వ్యక్తులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పేలుళ్లు క్షిపణి దాడి వల్ల జరిగాయా లేక పారిశ్రామిక ప్రమాదమా అన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
సినీ తారలు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారనే చర్చలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఈ లిస్టులో అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ పేరు కూడా వినిపిస్తోంది. రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో శోభిత రాజకీయాల గురించి మాట్లాడింది.. “నాకు వామపక్ష భావజాలం చాలా ఎక్కువ. భవిష్యత్తులో ఏదో ఒక రోజు కమ్యూనిజమే విజయం సాధిస్తుంది” అంటూ అక్కినేని కోడలు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.













