Last Updated:
టీటీడీ, సీఎస్‌ఐఆర్ సీఎఫ్‌టీఆర్‌ఐతో ఒప్పందం కుదుర్చుకుని తిరుమల శ్రీవారి ప్రసాదాల నాణ్యత, భద్రత, పోషక విలువలు, నిల్వ సామర్థ్యం మెరుగుపరచేందుకు శాస్త్రీయ చర్యలు ప్రారంభించింది
తిరుమల శ్రీవారి ప్రసాదాల నాణ్యత, భద్రత, సంప్రదాయ పరిరక్షణకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు విశ్వాసంతో స్వీకరించే శ్రీవారి ప్రసాదాలు మరింత నాణ్యమైనవి, సురక్షితమైనవి, పోషక విలువలు కలిగినవిగా ఉండేలా చర్యలు ప్రారంభించింది. ఈ దిశగా దేశంలోనే ప్రముఖ ఆహార పరిశోధనా సంస్థలలో ఒకటైన మైసూరుకు చెందిన సీఎస్‌ఐఆర్–సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CFTRI)తో టీటీడీ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం విశేషంగా మారింది.
బెంగళూరులో నిర్వహించిన రైజ్ కాన్‌క్లేవ్–2026 (Research, Innovation, Start-ups and Entrepreneurship) సదస్సులో ఈ ఒప్పందం అధికారికంగా జరిగింది. టీటీడీ తరఫున ప్రోక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ ఉమాశంకర్ పాల్గొనగా, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. దేవాలయ ప్రసాదాల నాణ్యతను శాస్త్రీయ ప్రమాణాలతో మెరుగుపరచేందుకు దేశంలో ఒక ఆలయ సంస్థ ఈ స్థాయి ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం ముడి పదార్థాల కొనుగోలు నుంచి ప్రసాదాల తయారీ, నిల్వ, పంపిణీ వరకు ప్రతి దశలో కఠినమైన నాణ్యత ప్రమాణాలు అమలు చేయనున్నారు. ప్రసాదాల తయారీలో ఉపయోగించే పదార్థాల స్వచ్ఛత, భద్రతను శాస్త్రీయ పద్ధతుల్లో పరీక్షించడంతో పాటు, కలుషిత ప్రమాదాలను తగ్గించేందుకు ఆధునిక సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టనున్నారు. దీంతో భక్తులకు అందే ప్రసాదాలు మరింత విశ్వసనీయంగా మారనున్నాయి.
అంతేకాకుండా శ్రీవారి ప్రసాదాల సంప్రదాయ రుచి, ప్రత్యేకతకు ఎలాంటి భంగం కలగకుండా వాటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక పరిశోధనలు, ప్యాకేజింగ్ విధానాలు కూడా అమలు చేయనున్నారు. నెయ్యి స్వచ్ఛత నిర్ధారణ, ఆహార నమూనాల సేకరణ, ఆధునిక పరీక్షా విధానాలు, కలుషిత పదార్థాల గుర్తింపు వంటి అంశాల్లో టీటీడీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఈ ప్రక్రియలో సీఎస్‌ఐఆర్–సీఎఫ్‌టీఆర్‌ఐ శాస్త్రవేత్తలు నేరుగా భాగస్వాములు కానున్నారు.
క్రమం తప్పకుండా తిరుమలలోని సంబంధిత కేంద్రాలను సందర్శించే శాస్త్రవేత్తలు పరిశోధన ఆధారిత సూచనలు, సాంకేతిక సహకారం అందించనున్నారు. ఈ భాగస్వామ్యంతో శ్రీవారి ప్రసాదాల నాణ్యత, భద్రత, పోషక విలువలు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడంతో పాటు, భక్తుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని టీటీడీ పేర్కొంది. సంప్రదాయం, సాంకేతికత కలయికగా మారిన ఈ నిర్ణయం తిరుమల చరిత్రలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirupati,Chittoor,Andhra Pradesh













